బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ బెంజ్ ఫ్లై ఓవర్-2 ప్రారంభానికి సిద్ధమైంది. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ -1ఇప్పటికే నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వచ్చింది. ఫ్లైఓవర్ -2 పనులను గత సంవత్సరం నవంబరులో ప్రారంభించారు. బెంజిసర్కిల్-2 ఫ్లై ఓవర్ శరవేగంగా రూపుదిద్దుకుని రికార్డు సృష్టించింది. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న లక్ష్మీ ఇన్‌ఫ్రా నిర్మాణాన్ని 18 నెలల కాలంలోనే పూర్తి చేయాల్సి ఉండగా 12 నెలల్లోనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేసింది. 1.4 కిలోమీటర్లు పొడవు ఉన్న ఫ్లైఓవర్ మొత్తం 224 భూగర్భ పిల్లర్లు, 56 పిల్లర్లు, 220 గడ్డర్లు, 56 స్పాన్లు, 56 శ్లాబులతో రూపుదిద్దుకుంది. నగరంలో జనావాసాలకు ధ్వని కాలుష్యం లేకుండా దీనిని నిర్మించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రేయింబవళ్లు కార్మికులు పనులు చేయడం, ప్రిఫ్యాబ్రికేషన్ పనులు సకాలంలో చేయగలగడంతో ముందుగానే నిర్మాణం పూర్తి చేశామని సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా శనివారం వాహనాలను అనుమతించారు.
ఫ్లైఓవర్ లేని సమయంలో స్క్యూ వంతెన నుంచి రమేష్ ఆసుపత్రి కూడలి వరకు దాదాపు 1400 మీటర్లను దాటేందుకు తక్కువలో తక్కువగా పావుగంట పట్టేది.. ఫ్లైఓవర్ పై నుండి 3 నిమిషాల్లో చేరుకున్నాయి. గుంటూరు వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా ఏలూరు వైపు వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదుగా దూసుకెళ్లాయి. వారం రోజుల పాటు వాహనాలను అనుమతించి సామర్ద్యాన్ని పరీక్షిస్తారు. బెంజ్-2 ఫ్లై ఓవర్‌పై రాకపోకలకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గనుంది. ఇప్పటివరకు ఒక వైపు ఫ్లై ఓవర్ ఉండటం వల్ల పెద్దగా తేడా కనిపించలేదు. నేడు రెండో ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవర్ల కారణంగా ఇక మీదట బెంజిసర్కిల్, నిర్మల కాన్వెంట్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పెద్దగా కనిపించదనే చెప్పాలి. అధికారికంగా ముహూర్తం వెల్లడికానప్పటికీ ఈనెల 14వ తేదీన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కూడళ్ళలో తగ్గిన ట్రాఫిక్ :
శనివారం సాయంత్రం నుంచి రెండు ఫ్లైఓవర్ల పై వాహనాలు వెళ్లడంతో బెంజి సర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ హాస్పిటల్ కూడళ్ళ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గింది. బెంజి సర్కిల్ వద్ద కేవలం బందరు రోడ్డు, ఎంజీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు మాత్రమే ఉన్నాయి. గురునానక్ రోడ్డు రమేష్ ఆసుపత్రి కూడలి రద్దీ ఎక్కువ. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు లయోలా కళాశాల, విద్యుత్తు సౌధ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల తదితర సంస్థలు ఉండడం, ఐదో నెంబరు (సిటీ బస్సు) మార్గం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కూడలికి ట్రాఫిక్ భారం తగ్గుతుంది. వారాంతాల్లో సాయంత్రం వేళల్లో కనీసం ఎన్టీఆర్ కూడలి వరకు ట్రాఫిక్ నిలిచిపోయేది. శనివారం నాడు మాత్రం ఓ మాదిరిగానే ట్రాఫిక్ ఉంది. చాలా వరకు ఉపశమనం లభించినట్లు వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడ్డారు. బహుళ యాక్సిల్ భారీ వాహనాలు సైతం వెళ్లేందుకు అనువుగా నిర్మించినట్లు అధికారులు తెలిపారు. పైవంతెనపై తారు వేసి జీబ్రాలైన్లు ఏర్పాటు చేశారు. వీధి దీపాలు అమర్చారు. రంగులు వేశారు. కేంద్ర మంత్రి ప్రారంభోత్సవానికి ముందు మిగిలిన మెరుగులు దిధ్దారు. ప్రస్తుతం రెండో ఫ్లై ఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.