Tuesday, November 19, 2024

AP | మెడికల్‌ కాలేజీలలో ఫ్యాకల్టీ నియామకంపై విధివిధానాలు సిద్ధం చెయ్యండి…

అమరావతి, ఆంధ్రప్రభ: వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఒక్క ఖాళీ ఏర్పడినా వెనువెంటనే భర్తీ చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని , అందుకనుగుణంగా చర్యలు తీసుకుని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలల్ని బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 53 వేలకు పైగా సిబ్బందిని నియమించుకోగలిగామని ఆమె అన్నారు.

ప్రతి పేదవానికీ వైద్య సేవలు అందుబాటు-లోకి తేవాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న తపన పడుతున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు సైతం స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు ఉచితంగా అందించడాన్ని సిఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. 2024 -25 నుండి మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభమయ్యే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతుల నిర్వహణకు విధివిధానాలు సిద్ధం చేయాలన్నారు.

- Advertisement -

సిబ్బంది నియామకాలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం మంగళగిరి లోని ఎపిఐఐసి టవర్స్‌ ఏడో ప్లnోర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంత్రి విడదల రజిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభమయ్యే 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో సరిపడా ఫ్యాకల్టీ మరియు సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పట్నించే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

ముఖ్యంగా బోధన సిబ్బంది నియామకాల్ని కాంట్రాక్టు, రెగ్యులర్‌ విధానంలో ఎలా చేపట్టాలన్న విషయంలో ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలన్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు రెమ్యునరేషన్‌ ఇవ్వడం, అలాగే రెగ్యులర్‌ విధానంలో ఇన్సెంటివ్స్‌ ఇచ్చేందుకున్న గల అవకాశాలు చూడాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న బోధన సిబ్బంది పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని మంత్రి రజిని సూచించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 17 కొత్త వైద్య కళాశాలన్ని నెలకొల్పడం ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత అందుబాటులో కి తీసుకొచ్చారన్నారు. దేశానికి స్వాతంత్యం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటు మునుపెన్నడూ జరగలేదన్నారు. ఈ విషయంలో దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందన్నారు. రానున్న విద్యా సంవత్సరం లో ప్రారంభమయ్యే 5 కొత్త వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ నియమాకానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.

ఇందుకోసం సిఎంసి వెల్లూరు లో అనుసరిస్తున్న విధానంపై కూడా ప్రతిపాదనలు పరిశీలించాలన్నారు. ఇప్పటికే ప్రారంభమైన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థుల హాజరు శాతం తగ్గుతున్నట్లు తన దృష్టికొచ్చిందని , దీనిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల్ని కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైజాగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌) బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి రజిని సూచించారు.

ఇందులో పోస్టుల్ని పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. ముఖ్యంగా స్పెషాలిటీ విభాగాల్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, సెక్రటరీ డాక్టర్‌ మంజులా హోస్మోని , సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ మరియు ఆరోగ్య శ్రీ సిఇవో డాక్టర్‌ వెంకటేశ్వర్‌, డిఎంఈ డాక్టర్‌ నరసింహం, డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ బాబ్జీ, రిజిస్ట్రార్ర్‌ డాక్టర్‌ రాధికా రెడ్డి తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement