Thursday, November 21, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు అందనున్న పీఆర్సీ వేతనాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఎట్టకేలకు ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాలు అందనున్నాయి. గత మూడు నెలలుగా కొత్త ఉద్యోగాలు రాక తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగులకు కొత్త వేతనాలు ఇచ్చేందుకు ఆర్థికశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరపగా సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆర్టీసీ ఉద్యోగులకు 23.29శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తూ గత జూన్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో విలీనమైన తేదీ నుంచి పీఆర్సీ వర్తిస్తుందని స్పష్టం చేసిన ప్రభుత్వం..జూలై నుంచి సవరించిన కొత్త వేతనాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే కేడర్‌ ఫిక్సేషన్‌, పదోన్నతులు సహా పలు అంశాలు తెరపైకి రావడంతో పీఆర్సీ ఉత్తర్వుల అమలు వాయిదాపడుతూ వస్తోంది. ఆర్థికశాఖ అధికారులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఉద్యోగుల అసంతృప్తి నేపధ్యంలో..ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేశారు. ఆర్థికశాఖ అధికారులతో సైతం ఉద్యోగ సంఘాల నేతలు చర్చించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలకు దిగారు. జిల్లాల వారీగా ఉద్యోగుల సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎంకు వినతి పత్రాలు అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతి పత్రం అందజేసింది. ఉద్యోగుల నిరసనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. పీటీడీ ఉద్యోగుల కొత్త వేతన సవరణ అమలుపై చర్చలు జరిపి ఆర్థికశాఖ అధికారులను ఒప్పించారు. కొత్త వేతనాలు ఇచ్చేందుకు ఆర్థికశాఖ అధికారులు సైతం సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆర్టీసీలోని 51వేల ఐదొందల మంది ఉద్యోగుల్లో రెండు వేల మంది ఇటీవల పదోన్నతి పొందారు. గత కొంతకాలంగా పదోన్నతుల అంశంపైనే ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తున్నారు.

ఉన్నతాధికారుల చర్చల్లో పదోన్నతి పొందిన వారు మినహా మిగిలిన ఉద్యోగులకు సెప్టెంబర్‌ 1న కొత్త వేతనాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. పదోన్నతి పొందిన వారి జాబితా ఫైలను ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆమోదం వచ్చిన తర్వాతనే వారికి కొత్త వేతన సవరణ ఉత్తర్వులు అమలు చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా పదోన్నతి పొందిన వారికి జాబితాను వారం రోజుల్లోగా ప్రభుత్వం ఆమోదించిన పక్షంలో వారికి కూడా కొత్త వేతనాలు అందనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement