Tuesday, November 26, 2024

పీఆర్సీ అంటే ‘పే రిడక్షన్ కమిషన్’ కాదు.. ‘పెంచేదే లే’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు: జీవీఎల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతభత్యాలు ‘పెంచేదే లే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీఆర్సీ అంటే ‘పే రిడక్షన్ కమిషన్’ కాదని, సీఎం జగన్ ఆ విషయం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ ఉద్యోగులకు అండగా ఉంటుందని, వారు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి సంఘీభావం తెలుపుతుందని జీవీఎల్ ప్రకటించారు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టుకోని ప్రభుత్వోద్యోగి లేడని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

మాది టీడీపీలాంటి పార్టీ కాదు, అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు, మరికొందరు నేతల అరెస్టుపై జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. సంక్రాంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడ వెళ్తుంటే అడ్డుకోవడమే కాక, అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గుల పోటీలకు వెళ్తుంటే అడ్డుకున్న పోలీసులు, అర్థనగ్న నృత్యాలకు అడ్డు చెప్పడం లేదని ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేయాలని, పార్టీ కోసం పనిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అసాంఘీక శక్తులు, మతోన్మాదులు పోలీసులపైనే దాడులకు తెగబడుతుంటే ఏమీ చేతకాని పోలీసులు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. “గుడివాడ ఏమైనా గండికోట రహస్యమా? అక్కడికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు” అంటూ ఆయన నిలదీశారు.

తెలుగుదేశం పార్టీతో వ్యవహరించినట్టు తమతో వ్యవహరిస్తే కుదరదని, తమదేమీ చిన్నపార్టీ కాదని జీవీఎల్ గుర్తుచేశారు. “టీడీపీతో మీకేమైనా ఉండొచ్చు.. మీరూ మీరూ చూసుకోవచ్చు.. కానీ బీజేపీతో కూడా టీడీపీలా వ్యవహరిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటున్నారన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement