న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, ఇతర పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీఆర్సీ) ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు. శనివారం ఉదయం పీఆర్సీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. పీఆర్సీగా బాధ్యతలు చేపట్టే ముందు భవన్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి, దుర్గాదేవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్య మరణించిన మాజీ పీఆర్సీసీ అభయ్ త్రిపాఠికి నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పీఆర్సీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రవీణ్ ప్రకాశ్, మళ్లీ ఢిల్లీ రావడం సంతోషంగా ఉందన్నారు.
గతంలో 2017 ఆగస్టు 5న రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్ టాస్క్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ చురుగ్గా పనిచేశారు. దీంతో 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రవీణ్ ప్రకాశ్‌ను తన పేషీలోకి తీసుకున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో తనదైన శైలిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకాలం పాటు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి భావన సక్సేనా, విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని జీ-20 సెక్రటరియేట్లో జాయింట్ సెక్రటరీగా డిప్యూటేషన్‌పై వెళ్లడంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాశ్‌ను పీఆర్సీగా నియమించింది.