మార్కాపురం – వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేశారని చెప్పారు. టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఎముకలు, కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు చేసి, మందులు అందిస్తున్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం ప్రక్రియ చేపడుతున్నారు. వైద్యులు సిఫార్స్ చేసిన వారికి కృత్రిమ కాళ్ళు, చేతులు అందిస్తారు. వైయస్ జగన్ సీఎం కాగానే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ..ఆసుపత్రుల్లో నియామకాలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా సౌకర్యాలు, వాతావరణం ఉండేలా, మంచి వైద్యం, రోగులకు మంచి భోజనం లభించేలా దృష్టి సారించారని తెలిపారు. వైద్య రంగంలో కూడా నాడు–నేడు కింద అభివృద్ధికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా, ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఈ పథకం కింద పేదలు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొద్ది రోజులు పనులకు వెళ్ల లేరు. విశ్రాంతి అవసరం అవుతుంది. ఆ సమయంలో వారి జీవనభృతికి ఇబ్బంది కాకుండా ‘వైయస్సార్ ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5,000 ఇస్తున్నారు. 108, 104 సర్వీస్ వ్యవస్థ రూపు రేఖలు మార్చారు. కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని వార్డుల్లో వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement