Wednesday, November 20, 2024

కుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

ఒంగోలు క్రైమ్ : జిల్లాలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని ఆడుకోడానికి పంపించాలన్నా భయపడి పోతున్నారు. యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్లస్తంభాల వీధిలో ఇంటిముందు ఆడుకుంటున్న షేక్ సలీం బాషా అనే ఆరేళ్ల బాలుడిపై ఓ కుక్క దాడి చేసి విచక్షణా రహితంగా కరిచింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బెస్తవారిపేట మండలంలోని దర్గా గ్రామంలో కూడా ఓ వ్యక్తిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దొరికిన చోటల్లా భయంకరంగా కరిచింది.

జిల్లాలోని అనేక గ్రామాల్లో తరచుగా కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఒంగోలు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. గడ్డల గుంట, బలరాం నగర్, పాత కూరగాయల మార్కెట్ వీధి, వెంకటేశ్వర నగర్, సుజాత నగర్, గోపాల్ నగర్, ఇస్లాం పేట, తదితర వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా వుంది. బాపూజీ కాంప్లెక్స్ వెనుక రెండో వీధిని కుక్కల బజార్ అని పిలుస్తారు. దీనిని బట్టి ఇక్కడ కుక్కల సమస్య ఎంతగా వుందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం రోడ్ల మీద సంచరిస్తున్న కుక్కలు పాదాచారులు, వాహనదారుల మీద దాడికి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా కుక్కల్ని చూసి భయపడి పారిపోతున్న చిన్నారులు, బాలికల వెంటపడి కొరికేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా…. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీలు కాని, నగరంలో కార్పోరేషన్ అధికారులు కాని ఈ కుక్కల బెడదను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement