Friday, November 22, 2024

Ongole: టీడీపీ-వైసీపీ బాహాబాహి.. బాలినేని, దామ‌చ‌ర్ల వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం రాత్రి ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యా రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం దీనికి కారణమైంది. ఒంగోలులోని సమతానగర్‌లో బాలినేని, ఆయన కోడలు కావ్యా రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో రాజీనామా చేసిన ఓ వలంటీర్‌ పాల్గొన్నారు. సమతానగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో వారు ప్రచారానికి వెళ్లగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్, ఆయన అనుచరులు, ఇతర టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వాలంటీర్‌తో ఎందుకు ప్రచారం చేయిస్తున్నారంటూ దామచర్ల అనుచరులు బాలినేని, ఆయన కోడలిని నిలదీశారు.

ఆ వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని, స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని బాలినేని కావ్యారెడ్డి వివరించారు. రాజీనామా చేసిన తరువాత ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవచ్చంటూ ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తోన్నాయని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వారు వినిపించుకోలేదు. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దాడులకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమతానగర్‌కు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ మరింత తీవ్రతరమైంది. ఒకరినొకరు తోసుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొద్దిసేపటికి దామచర్ల జనార్ధన్ సమతా నగర్ చేరుకున్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డితో వాగ్వివాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ-టీడీపీ నాయకులను చెదరగొట్టారు. అనంతరం గాయపడ్డ తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన తనపై దాడి చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తన కోడలిని బూతులు తిట్టారని, పక్కకు నెట్టివేశారని ఆయన ధ్వజమెత్తారు. తాము చేస్తోన్న ఇంటింటి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని బాలినేని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని సైతం అడ్డుకునేంత దుర్మార్గానికి టీడీపీ పాల్పడుతోందని, మళ్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే అక్కసుతో గొడవలకు దిగుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement