Tuesday, November 26, 2024

అంగ‌ట్లో రేష‌న్ బియ్యం.. చోద్యం చూస్తున్న అధికార గ‌ణం..

గిద్దలూరు : గిద్దలూరు నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్ఛ‌గా సాగిపోతుంది. రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండాపోయింది. అధికారులతో చేతులు కలిపి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ అక్రమ రవాణా య‌థేచ్ఛ‌గా జరుగుతుందని ఫిర్యాదులు వచ్చిన ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గిద్దలూరు, కొమరోలు, బెస్తవారిపేట, రాచెర్ల మండలాల్లోని కొందరు డీలర్లతో మిలాఖత్ అయి అక్రమార్కులు అక్రమార్జనకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం ఇచ్చిన అధికారులు స్పందించడం లేదని అంటున్నారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి రేషన్ బియ్యం పట్టుకుంటున్నారంటే స్థానిక అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. అడిగేవారు అడ్డుకునేవారు కనుచూపు మేరలో కనిపించకుండా పోవడంతో అక్రమ రేషన్ దందా వ్యాపారులు ఆడిందే ఆట పాటిందే పాటగా జరిగిపోతుంది. గిద్దలూరు ప్రాంతంలో అక్రమ రేషన్ వ్యాపారం అక్రమార్కులకు కల్పతరువుగా మారి జేబులు నింపుతుంది. గిద్దలూరు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని ఇక్కడి నుండి కర్నూలు, కడప జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యం కిలో రూ.10లకు కొనుగోలు చేసి వాటిని మిల్లులకు తరలించి పాలిష్ పట్టి తిరిగి వాటినే నాణ్యమైన బియ్యంగా టిక్కీలుగా మార్చి టిక్కీ (50కిలోలు) రూ.2000లకు అమ్ముతు మోసం చేస్తున్నారని తెలిసింది.

రేషన్ అక్రమ రవాణాలో చోటా నాయకులు..
గిద్దలూరు ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో చోటా నాయకులు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. వీరు అధికారులతో చేతులు కలిపి అక్రమ దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వీరిలో కొందరిపై అక్రమ బియ్యం రవాణాలో పెట్టుబడిగా కేసులు కూడా నమోదయ్యాయని తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement