Tuesday, November 26, 2024

ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు కరువు..

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద పడకల కోసం నిధులు మంజూరు అయినప్పటికీ పనులు ముందడుగు లేదు.పాత భవనంలోనే వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. రోగుల సహాయకులు.. చెట్ల కిందే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 1973 లో 35 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు. తర్వాత అది 50 పడకల ఆసుపత్రిగా మార్పు చేశారు. జిల్లా కేంద్రం ఒంగోలుకి 150 కిలోమీటర్ల దూరం ఉండటం, అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్‌ హైవే నిర్మాణం చేపట్టడంతో రోజువారీ రోగులతోపాటు ప్రమాద బాధితుల తాకిడీ పెరిగింది. మెరుగైన వైద్య సేవల కోసం గత ప్రభుత్వం 2018లో వంద పడకలకు అప్ గ్రేడ్ చేస్తూ…. నూతన భవన నిర్మాణానికి 24 కోట్లు నిధులు మంజూరు చేసింది. కానీ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయి… రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భవన నిర్మాణాన్ని15 నెలల్లో పూర్తి చేసి, మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది మార్చిలో పనులు ప్రారంభించినప్పటికీ.. నిర్మాణం పిల్లర్ల దశ దాటలేదు. చేసేదిలేక అక్కడున్న పాత భవనంలోనే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు 300 పైచిలుకు రోగుల వస్తుండగా ఆ మేరకు సదుపాయాలు లేక.. వైద్య సిబ్బంది కొరతతో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులూ ఉన్నాయి. కరోనా కారణాలతో నిర్మాణం ఆలస్యమైందని త్వరలోనే పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రి నూతన భవనాన్ని త్వరగా పూర్తిచేసి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement