Tuesday, November 26, 2024

నాటుసారా, గంజాయి నిర్మూలనే లక్ష్యం : ఎస్పీ వకుల్ జిందాల్

చీరాల, మార్చి 28(ప్రభ న్యూస్) : జిల్లాలో గంజాయి, నాటు సారాయి నియంత్రించాలని లక్ష్యంతోనే విడతల వారిగా పలు ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని టూ టౌన్ పోలీసులు అధికారులు మంగళవారం తెల్లవారి జామున కార్డాన్ సెర్చ్ చేపట్టారు. చీరాల 2వ పట్టణ ఇన్ స్పెక్ట‌ర్ జి.సోమశేఖర్ ఆధ్వర్యంలో చీరాల ఒన్ టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ వి.మల్లికార్జునరావు, చీరాల రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ ఏ.మల్లికార్జునరావు, చీరాల 2వ పట్టణ ఎస్ఐలు పి.సురేష్, నాగరాజు, చంద్రావతి, చీరాల రూరల్ ఎస్.ఐ జనార్దన్ , సెబ్ అధికారులు, 40 మంది పోలీస్ సిబ్బందితో కలిసి చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోశయ్య కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నాటుసారా, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా గతంలో నాటుసారా తయారు చేసిన ప్రదేశాలతో పాటుగా గంజాయి విక్రయించే అనుమానితుల గృహాలను, అనుమానిత ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నాటుసారా తయారీ క్రయ, విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తరచు నాటుసారా తయారీ క్రయ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ అమలు పరుస్తున్నామని ఎస్పీ తెలిపారు. అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకాడబోమని, నాటుసారా తయారీ దారులకు నాటుసారా తయారీకి కావలసిన ముడిసరుకు అమ్మిన వారిపైన కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాటు సారాను జిల్లా నుండి పూర్తిగా నిర్మూలించే వరకు ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు.
ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాల సంబంధించిన సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు సమాచారం అందించాలని లేదా ఎస్పీ బాపట్ల హెల్ప్ లైన్ నెంబర్ 8333813228 కు, ఎస్.ఈ.బి టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచార అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement