Monday, November 25, 2024

ఈవిటీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

ఉలవపాడు : ఉలవపాడు మండలంలో ఈవిటీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పి.విశ్వనాధ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించినా, యువతులను టార్గెట్‌చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మండలంలో కోడి పందాలు, పేకాట నిర్వహించినా వారిపై కేసులు నమోదుచేస్తామని ఆయన తెలిపారు. కోడిపందేలు, పేకాట సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, కావున మండలంలో ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంటే నేరుగా తనకు తెలియజేయవలసినదిగా ఆయన కోరారు. మండల కేంద్రమైన ఉలవపాడులో అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య ఉందని ఆంధ్రప్రభ ఎస్సై దృష్టికి తీసుకెళ్ళగా ట్రాఫిక్‌ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్లు తమ ఆటోకు సంబంధించిన రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు తప్పకుండా ఆటోలోనే భద్రపరచుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్‌ ధరించాలని, కొంత మంది ఆటో డ్రైవర్లు లుంగీలు కట్టుకుని నడుపుతున్నారని, అలా ఆటోనడిపితే ప్రమాదకరమని అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలో డ్రైవర్‌కు ఇరువైపులా ఎవరినీ కూర్చోపెట్టరాదని, ఆటోలో పరిమితి సంఖ్యలో మాత్రమే ప్రయాణికలను ఎక్కించుకోవాలన్నారు. ఆటోలలో టేప్‌రికార్డులు పెట్టి పెద్దగా సౌండ్‌ పెట్టరాదని, ఆటోలో ఎక్కే మహిళలపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. అలాగే సచివాలయ మహిళా పోలీసులను గురించి మాట్లాడుతూ సిసి కెమేరాలు ఉన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, సిసి కెమేరాలు లేని దేవాలయాలు ఎన్ని ఉన్నాయో వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement