Friday, November 22, 2024

ప్రకాశం జిల్లాలో కార్డన్ సెర్చ్.. పోలీసుల స్పెషల్ డ్రైవ్..

ఒంగోలు, ( ప్రభన్యూస్‌) : జిల్లాలో జరుగుతున్న నేరాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల టంగుటూరులో జరిగిన తల్లీ,కూతుర్ల హత్య, ఇంకొల్లు మండలంలోని పూసపాడులో జరిగిన వృద్ద దంపతుల హత్యల్లో పోలీసులు పురోగతి సాధించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టంగుటూరు, కంభం ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ చర్యల్లో భాగంగా చెడునడత కలిగిన వ్యక్తులు, సంఘవ్యతిరేక శక్తులు, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిపై కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తులు, నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, సామాన్య ప్రజానీకానికి భద్రతా భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ పోలీస్‌శాఖ నిర్వహించే ఇటువంటి కార్యక్రమానికి తమవంతు సహకారాన్ని అందించాలని పోలీసులు కోరారు.

ఈ కార్డన్ సెర్చ్ లో చెడు నడత కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, పాత నేరస్తులు గురించి సమాచారం సేకరించారు. ప్రస్తుతం వారి కార్యకలాపాలపై ఆరా తీశారు. సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని వెంటనే పోలీసులకు లేదా 100కు తెలియజేయాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌లో 32 లీటర్లు నాటుసారా, 37 మద్యం సీసాలు, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 5 కేజీల గంజాయి, సరైన పత్రాలు లేని కారణంగా 169 మోటార్‌ సైకిళ్లు, 11 ఆటోలు, ఒక ట్రాక్టర్‌ మొత్తం 181 వాహనాలు సీజ్‌ చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement