Friday, November 22, 2024

రామాయపట్నం పోర్టు – రైతులకు కలెక్టరు హామీలు

కందుకూరు టౌన్‌ , : రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చిన వారికి చట్టపరంగా అన్ని ప్రయోజనాలు వేగంగా దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. భూసేకరన ప్రక్రియలో భాగంగా నిర్వాసితులకు నష్టపరిహారం నిర్ణయించడంపై ఆదివారం కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డితో కలిసి రావూరు పంచాయితీ పరిధిలోని నిర్వాసితులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములిచ్చిన నిర్వాసితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీలో భాగంగా లభించే ప్రయోజనాలను వివరించారు. పోర్టు కోసం భూములు ఇస్తున్న వారికి ప్రభుత్వం నుంచి నగదు రూపంలో చట్టపరంగా లభించే పరిహారానికి ఉన్న అవకాశం, ప్రభుత్వ నిబంధనలను ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం నష్టపరిహారం ధర విషయంలో స్థానికుల అభిప్రాయాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ పట్టా భూములకు ఎకరానికి రూ.15 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అసైన్డ్‌ భూములకు కూడా ఇలాగే పరిహారం ఇస్తామన్నారు. నిరభ్యంతర ప్రభుత్వ మూములు కలిగి ఉన్న వారు నష్టపోతుంటే ఎకరానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. కలెక్టర్‌ ఇచ్చిన హామీకి స్థానికులు కూడా అంగీకరించారు. భూములు ప్రభుత్వానికి అప్పగించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను సోమవారం నుంచే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ, గుడ్లూరు తహశీల్దారు శిల్ప, మెరైన్‌ బోర్డు అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
– కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలి… కలెక్టర్‌ పోలా భాస్కర్‌….
కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియను ఉధృతంగా చేపట్టాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఆదివారం సాయంత్రం కందుకూరులోని విజయబాలాజీ కళ్యాణ మండపంలో మున్సిపాలిటీ పరిధిలోని సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వారితో పాటు 45-59 ఏళ్ల వయసు ఉండి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. సచివాలయ స్థాయిలో వ్యాక్సిన్‌ వేస్తున్నందున ఏఎన్‌ఎంలు, మహిళా పోలీసులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, విఆర్వోలు, పంచాయితీ సెక్రటరీలు ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. కంటైన్మెంట్‌ విషయంలో తహశీల్దారులే నిర్ణయం తీసుకుని సమర్ధవంతంగా అమలుచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఎంహెచ్‌ఓ ప్రియంవద, మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌.మనోహర్‌, తహశీల్దారు సీతారామయ్య, డాక్టర్‌ స్వాతి, ఏఎన్‌ఎంలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement