Tuesday, November 26, 2024

ఎస్సీ కార్పోరేషన్‌లో… కార్ల గోళ ! అధికారుల వ్యవహారశైలి పై మండిపడుతున్న దళిత సంఘాలు

దళిత నిరుద్యోగ యువతకు ఉపాధి చూపేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ఇన్నోవా కార్ల పై రాజకీయ దుమారం రేగుతోంది. అర్హులైన నిరుద్యోగులకు అందజేయాల్సిన కార్లను రాజకీయ మెప్పు కోసం ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు పాకులాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సార్‌ మీ నియోజకవర్గం నుంచి ఎవరిని ఎంపిక చేయమంటారు..?’ అంటూ ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ అధికారులు అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎస్సీ కార్పోరేషన్‌లో ఇన్నోవా కార్ల పంపిణీ వ్యవహారం మరో సారి రచ్చకెక్కుతోంది. ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ వ్యవహారశైలి పై దళిత సంఘాలు పండిపడుతున్నాయి. ఇప్పటికే ఆయన పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నాయకులు…జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేయడంతో పాటు, ఆందోళనకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

ఒంగోలు, ప్రభన్యూస్ : దళిత నిరుద్యోగ యువతకు ఉపాధి చూపేందుకు ప్రభుత్వం అందజేస్తున్న కార్ల పంపిణీ.. ప్రజా ప్రతినిధుల మెప్పు కోసం అధికారులు పాకులాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద జిల్లాకు మంజూరైన 11 ఇన్పోవా కార్ల పంపిణీ గతంలో వాయిదా పడటంతో.. ఇప్పుడు పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దళిత నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దళిత నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్ల నుంచి 482 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి రెండు రోజుల క్రితం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఒంగోలు డివిజన్‌లో 272 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంటర్వూలకు 145 మంది హాజరయ్యారు. మార్కాపురం డివిజన్‌ నుంచి 83 మంది దరఖాస్తు చేసుకోగా 43 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కందుకూరు డివిజన్‌ నుంచి 128 మందికి గాను 109 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే 11 కార్లకు వందల మంది దరఖాస్తు చేసుకోవడంతో అధికారులకు కార్ల పంపిణీ తలనొప్పిగా మారింది. దీంతో కొత్త భాష్యానికి తెరతీసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజా ప్రతినిధుల మెప్పు పొందాలంటే ఇదే మంచి అవకాశమని భావించిన అధికారులు ప్రజా ప్రతినిధులు సూచించిన వారికే ఇన్పోవా కార్లను కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకోసమే అధికారులు ప్రజా ప్రతినిధులకు మరీ ఫోన్లు చేసి ‘సార్‌ మీ నియోజకవర్గంలో ఎవరికి కేటాయించాలో చెప్పండీ’ అంటూ అడుగుతున్నారని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు ‘దళారులను నమ్మి మోసపోవద్దంటూ’ నిరుద్యోగులను అప్రమత్తంగా చేస్తున్న అధికారులే దొడ్డిదారిన కార్లను పంపిణీ చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ కార్పోరేషన్‌ అధికారుల వ్యవహార శైలి పై దళిత నాయకులు మండిపడుతున్నారు. మూడు రోజుల పాటు ఇంటర్వ్యూలకు వచ్చిన ఆయాశాఖల అధికారులను మభ్యపెట్టి.. నిరుద్యోగులకు బోగస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. ఒక వైపు దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండగా.. అధికారులు మాత్రం ప్రజా ప్రతినిధుల మెప్పుకోసం తాపత్రయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement