Tuesday, November 26, 2024

వాక్సిన్‌తో కరోనా కట్టడి సాధ్యం..

కందుకూరు : కరోనా వాక్సిన్‌ను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి హెచ్చరించారు. కందుకూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి స్వగ్రామమైన మాచవరంలో జరిగిన వాక్సినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల నిర్లక్షయం, ఏమరుపాటు వంటి కారణాల వలన కరోనా మహమ్మారి మళ్ళీ చెలరేగుతున్నదని మహీధర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా బారిన పడిన వారు కార్పోరేట్‌ హాస్పిటల్స్‌కు వెళ్ళి 20 లక్షలకు పైగా ఖర్చు పెట్టుకున్నప్పటికీ క్షేమంగా తిరిగి రాలేని దయనీయ పరిస్థితులను ఎన్నో చూస్తున్నామని అన్నారు. ఈ పరిస్థితులలో కరోనా నుండి రక్షణ పొందాలంటే వాక్సినేషన్‌ ఒక్కటే శరణ్యమని స్పష్టంచేశారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వాలు వాక్సిన్‌ ను ఉచితంగా అందిస్తున్నప్పటికీ అజ్ఞానంతో అనేకమంది వాక్సిన్‌ను తీసుకోడానికి ఇష్టం పడటం లేదని అసహనాన్ని వ్యక్తంచేశారు. కరోనా బారిన పడితే వారి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుందని హెచ్చరించారు. ఈ దురవస్థ నుండి క్షేమంగా బయటపడటానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాక్సిన్‌ తీసుకోడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మహీధర్‌ రెడ్డి హితబోధ చేశారు. ఈ కార్యక్రమలో వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement