- విద్యుత్ ప్రమాదంలో 11 నెలల చిన్నారి మృతి
- తల్లడిల్లిన తల్లిదండ్రులు
- కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న గ్రామస్తులు
చీరాల, (ప్రభ న్యూస్): ముక్కుపచ్చలారని చిన్నారి.. వచ్చే నెలలో మొదటి పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆ బాబు విగత జీవుడయ్యాడు. ఈ ఏపీలోని చీరాలలో శుక్రవారం రాత్రి జరిగింది. విజయ నగర్ కాలనీలో తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న వినోద్ దివ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. అద్దె ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. పిల్లల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో లేక లేక ఒక సంతానం కలిగింది. బిడ్డ పుట్టినప్పుడే ప్రాణాపాయం ఉందని డాక్టర్లు చెప్పినప్పటికీ కంటికి రెప్పలా చూసుకుని వైద్యం అందిస్తూ కాపాడుకుంటున్నారు.
అయితే. ఆ చిన్నారి రియాన్ హన్స్ (11 నెలలు) గడిచేసరికి వారి ఆశలన్నీ అడియాసలైపోయాయి. శుక్రవారం కురిసిన వర్షంతో ఇంటిలో షార్ట్ సర్క్యూటివ్ ఏర్పడింది. ఆ చిన్నారి బంధాడుతూ నీటి మోటారును తాకటంతో కరెంట్ షాక్ తగిలి విగత జీవుడయ్యాడు. తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. వైద్య పరీక్షలు అందించినప్పటికీ బాబు చనిపోయాడని చెప్పడంతో ఆ కన్నపేగు తల్లడిల్లిపోయింది. తమ బిడ్డ బతికే ఉన్నాడనుకొని ఆశ చావక 108 వాహనాన్ని పిలిపించుకుని పరీక్షలు కూడా చేయించారు.
అయినా ఫలితం లేకపోయింది. వచ్చే నెలలో బిడ్డ పుట్టినరోజు ఎంతో ఆర్భాటంగా చేసుకుందామని కలలుగన్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా ఆవిరి అయిపోవడంతో స్థానికుల సైతం ఈ ఘటన చూసి తల్లడిల్లి పోతున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు.బిడ్డల కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన చూసే చూపరులను కంటతడి పెట్టించింది.