Saturday, November 23, 2024

AP | డేంజర్‌ జోన్‌లో ప్రకాశం బ్యారేజీ..!

ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు వరదనీరు చేరగా.. బ్యారేజీకి దిగువున ఉన్న విజయవాడ నగర పరిధిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గతంలో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ (రక్షణ గోడ) అంచుకు వరద నీరు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వాల్‌ పై నుంచి కూడా ప్రవాహం అవతలి వైపుకు చేరుతుంది.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 11 లక్షల 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం మరింత పెరిగితే బ్యారేజీకి కూడా తాకిడి పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే 12 లక్షల క్యూసెక్కుల వరకు దిగువకు వదిలేస్తారు.. దీంతో బ్యారేజీకి దిగువున ఉన్న నగర పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు లంక గ్రామాలు కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని చవిచూడాల్సి వస్తుంది.

అయితే ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీకి దిగువున ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా అడ్డుకునేందుకు ముందస్తు చర్యలను చేపడుతోంది. ఆ దిశగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తోంది.

ప్రకాశం బ్యారేజీకి 12 లక్షలకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరితే మాత్రం విజయవాడ నగర పరిధిలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపులో విలవిలలాడుతున్నాయి. బుడమేరు ఉగ్రరూపం నుంచి నగరం ఇంకా బయట పడలేదు. ఈలోపే కృష్ణమ్మ కన్నెర్ర చేయడంతో బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement