Wednesday, January 29, 2025

AP | విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్.. వెల్లువెత్తిన విన్నపాలు..

విశాఖపట్నం బ్యూరో, ఆంధ్ర ప్రభ : ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఓ పత్రికపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విశాఖ వచ్చిన మంత్రి లోకేష్.. ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 57వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల కుమార్తెకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అవసరమని, ఇప్పటికే రూ.10 లక్షలు ఖర్చయ్యాయని అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కన్నురుపాలెంకు చెందిన రుత్తల ప్రభాకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తమకు ఎటూ పాలుపోవడం లేదని, తమ కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీఎంఆర్డీయేలో 20 సంవత్సరాలు ఎన్ఎంఆర్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసిన తన భర్త సర్వీసులో ఉండగానే అనారోగ్యంతో మరణించారని, కారుణ్యనియామకం కింద తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విశాఖకు చెందిన పి.ధనలక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

తన భర్తతో పాటు సేవలందించిన వారికి వీఎంఆర్డీయే క్రమబద్ధీకరించిందని, తన భర్త మరణించి 17ఏళ్లు గడిచినప్పటికీ తనకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి సంపాదించిన భూమి, ఇంటిని బత్తిన అప్పల్ల, బత్తిన సూరిబాబు, బత్తిన దేవి, మైనపు గణపతి, మైనపు ఈశ్వరమ్మ కలిసి కబ్జా చేశారని, విచారించి న్యాయం చేయాలని విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం ఖాశాపేటకు చెందిన అంగటి లక్ష్మి మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన తల్లిదండ్రులిద్దరూ మరణించారని, వారు సంపాదించిన ఆస్తి తనకు దక్కకుండా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో రాణిస్తున్న తనకు శిక్షణ కోసం ఆర్థిక సహకారం అందించాలని విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన దొంతర గ్రీష్మ కోరారు.

- Advertisement -

గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ ను పునరుద్ధరించాలని విశాఖపట్నం సీతంపేటకు చెందిన అవ్వకాంతం విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్టీఈ యాక్ట్ రూల్ 14 అనుసరించి ఫారమ్ నెం.1ను ఈ నెల 31లోగా సమర్పించాల్సి ఉందని, అయితే ఫారమ్ నెం.1ను సమర్పించేందుకు మరికొంత గడువు ఇప్పించాలని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విశాఖ మురళీనగర్ లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం కల్పించాలని మురళీగనర్ రెసిడెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement