Saturday, October 5, 2024

Prajadarbar – టీడీపీ దాడులకు భయపడొద్దు ధైర్యంగా ఉండండి – జగన్

ఆంధ్రప్రభ స్మార్ట్, పులివెందుల ప్రతినిధి: కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదివారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జగన్ పులివెందులకు రావడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పులివెందుల సందడిగా మారింది. తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న జగన్ కార్యకర్తలతో, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

తమకు టీడీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది కార్యకర్తలు జగన్ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌తో భేటీ అయ్యారు.రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చ‌..మొదటగా పులివెందుల కు చెందిన నేతలతో వైయస్ జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులను జగన్ పేరుపేరునా పలకరించారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన అంశాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి నోట్ చేసుకుంటూ కనిపించారు.

అనంతరం కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు జగన్ తో సమావేశం అయ్యారు. ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా..ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తోపాటు అనంతపురం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జగన్ తో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ నాయకులు కూడా జగన్ తో సమావేశం అయ్యారు.

- Advertisement -

‘ఓ ధీరుడి పయనం’ ఆవిష్కరణ..

డాక్టర్ తవ్వా వెంకటయ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంపై రచించిన ‘ఓ ధీరుడి పయనం’ సమరం నుండి సంక్షేమం వైపు.. అనే పుస్తకాన్ని వైఎస్. జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన వెంకటయ్య చేసిన కృషిని కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, రెడ్యం చంద్రశేఖర రెడ్డి, నేట్లపల్లి శివరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా

పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ తనను కలిసిన నేతలకు సూచించారు. తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కి ఓటు వేసిన కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ చెడు సంప్రదాయానికి చంద్రబాబు బీజం వేశారని రానున్న రోజుల్లో ఆ పార్టీ నాయకులే ఇబ్బందులు పడక తప్పదని ఆయన మరోసారి హెచ్చరించారు. స‌మ‌స్య‌లుంటే నేరుగా చెప్పండి..నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.. అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు.

కాగా.. జగన్ ను కలిసేందుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా భారీకెడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల ద్వారా జగన్ ను కలిసే ఏర్పాటు చేశారు. ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలను నియోజకవర్గాల వారీగా అనుమతించారు. ఏదేమైనప్పటికీ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సందడి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement