Friday, November 22, 2024

Power Star – వరద బాధితులకు ఆరు కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్..

ఎపి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి త‌న దాన గుణాన్ని చాటుకున్నారు.. ఇప్ప‌టికే వ‌ర‌ద బాదితుల కోసం కోటి విరాళం ప్ర‌క‌టించిన ఆయ‌న తాజాగా మ‌రో అయిదు కోట్లు విరాళం ఇస్తునట్లు చెప్పారు.. ఈ వాన‌లు, వ‌ర‌ద‌లో ఎపిలో మొత్తం నాలుగు వందల గ్రామాలు దెబ్బ‌తిన్నాయ‌ని, ఆయా గ్రామాల‌ను ఆదుకోవ‌ల‌సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని నేడు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.. త‌న వంతు సాయంగా ఒక్కోగ్రామానికి ల‌క్ష రూపాయ‌లు చొప్పున ఆయ గ్రామ పంచాయితీల‌కు పంప‌నున్న‌ట్లు చెప్పారు.. అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా మరో కోటి రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పవన్ మొత్తం ఆరు కోట్లు విరాళం ఇచ్చినట్లైంది.

పంచాయితీ రాజ్ ఉద్యోగుల నుంచి రూ.14 కోట్లు విరాళం ..

అంతే కాకుండా త‌న శాఖ పంచాయితీ రాజ్ ఉద్యోగులు త‌మ వేత‌నం నుంచి రూ .14 కోట్లు వ‌ర‌ద స‌హాయ నిధికి ఇవ్వ‌నున్నార‌ని అధికారికంగా ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3,312కి.మీ. మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు, భవనాల శాఖకు తీవ్రం నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన 233కి.మీ. మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు. వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

- Advertisement -

విమర్శలు మాని సాయం చేయండి…వైసిపి కి పవన్ హితవు

బుడమేరులోని 90 శాతం ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని పవన్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ వయసులోనూ జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆయన్ను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని వైకాపా నేతలను ఉద్దేశించి హితవు పలికారు. వైకాపా నేతలు ముందు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని.. ఆ తర్వాతే ఆరోపణలు చేయాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదంటూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై పవన్‌ స్పందించారు. తాను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికార యంత్రాంగానికి ఒత్తిడి ఉంటుందని చెప్పడంతో తాను వెళ్లలేదని చెప్పారు. ”ఇంకా విమర్శించాలనుకుంటే వైకాపా నేతలు నాతో పాటు ఎక్కడికైనా రావొచ్చు. నా కాన్వాయ్‌లోనే తీసుకెళ్తాను. నాతో నడవండి.. ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు మీరే సలహా ఇస్తారు. ఇది రాష్ట్ర సమస్య. వైకాపా నేతలు సహాయం చేసి మాట్లాడాలి. ఇళ్లలో కూర్చొని విమర్శలు చేస్తే సరిపోదు”అని పవన్‌ వ్యాఖ్యానించారు.

సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని పవన్‌ తెలిపారు. 175 బృందాలు విజయవాడ అర్బన్‌లో పనిచేస్తున్నాయన్నారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి వచ్చిన 900 మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. వరదలకు ఎక్కువగా ఎన్టీఆర్‌ జిల్లా దెబ్బతిందని తెలిపారు. 26 ఎన్డీఆర్‌ఎఫ్‌, 24 ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. నేవీ నుంచి 2, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement