Tuesday, November 26, 2024

ఏపీలో విద్యుత్‌ రంగం నిర్వీర్యం.. అనాలోచిత నిర్ణయాల వల్లే కష్టాలు: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో విద్యుత్‌ రంగం నిర్వీర్యం అయిందని, వ్యవసాయం, సేవా, పారిశ్రామిక రంగాల్లో పురోగతి కుంటుపడిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు, ధరల పెరుగుదల తదితర అంశాలపై ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు ఒక లేఖ రాశారు. ప్రజలకు జీవనోపాధి, అభివృద్ధిని వేగవంతం చేయడంలో విద్యుత్‌ రంగానిది కీలకపాత్రని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగమే వెన్నుముక లాంటిదని పేర్కొన్నారు. నిరంతరాయమైన విద్యుత్‌ను అందించినప్పుడే పారాశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు రాష్ట్ర పురోగభివృద్ధికి ఆసరా నిలుస్తాయన్నారు. అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికాలోపంతో విద్యుత్‌ రంగం నిర్వీర్యమైందని కోతలు, ఛార్జీల పెంపుతో భవిష్యత్‌ అంధకారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రతిష్ట దేశ వ్యాప్తంగా దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండేదని ఆనాడు అనేక సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ప్రొత్సాహకాలు అందించామని తెలిపారు.

ఈ సంస్కరణలతో మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని, దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలబడిందన్నారు. కరెంట్‌ కోతల్లేకుండా విద్యుత్‌ ఛార్జీలను పెంచకుండా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్‌ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్‌ వినియోగం నానాటికి పెరుగుతుందని, దానికి సరిపడే విధంగా ఉత్పత్తి పెంపు చేయాలన్న ఆలోచన లేకుండా విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను కూడా రద్దుచేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోళ్లు చేయడం పట్ల ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల ఉత్పత్తి పెంపు సామర్ధ్యంపై పెట్టలేదని విమర్శించారు. బొగ్గు సంస్థలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే సరఫరా నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించిందన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడిందని చంద్రబాబు ఆరోపించారు. గడిచిన మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారాన్ని వేయడమే కాకుండా విద్యుత్‌ సంస్థల పేరిట రూ. 26 వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. మూడేళ్లలో పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, అప్పుగా తీసుకున్న రూ. 26 వేల కోట్లు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. మిగులు విద్యుత్‌ రాష్ట్రాన్ని లోటు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దిన పాపం ముఖ్యమంత్రి సంబధిత అధికారులదేనని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినా, మొండిగా ముందకు వెళ్లి విద్యుత్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని వ్యాఖ్యానించారు. పవర్‌ హాలిడేగా ప్రకటనతో పారిశ్రామిక రంగం నిర్వీర్యం అవడమే కాకుండా లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారని, మరోవైపు విద్యుత్‌ కోతలతో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు.

కరెంట్‌ కోతలు వైద్య రంగానికి కూడా శాపంగా మారాయని, కడప జిల్లా రిమ్స్‌ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా లేక రెండ్రోజుల్లో ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ప్రసవాలు చేశారని, ఇక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. పరీక్షల సమయంలో కోతలతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ ద్వారా వివరించారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన నిరాంతరాయమైన విద్యుత్‌ను అందించి ప్రజల జీవన ప్రమాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement