ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు డిస్కమ్‌లను నిండా ముంచేశాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నప్పటికీ ఈ పరిస్థితులనుంచి బైటపడే సూచనలు కనిపించడం లేదు. ఆదాయానికి, వ్యయానికి మధ్య భారీ తేడా ఉండటం, రుణభారం, వడ్డీల చెల్లింపులు భరించలేని స్థితికి చేరాయి. ఈ పరిస్థితినుంచి గట్టెక్కించటానికి విద్యుత్ సంస్థల అధికారులు తీవ్రప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అదేమీ సులభం కాదు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదు ర్కొంటున్నాయి. విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించవల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకు పోవడం, రుణాలు తీసుకోలేని స్థితికి చేరడం, రుణ పరిమితులు అప్పటికే దాటిపోవడం, రెవిన్యూగ్యాప్ భారీగా పెరగటం, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా అడ్డగోలు రేట్లకు విద్యుత్ కొనుగోలువంటివన్నీ కలిసి డిస్కమ్‌లను అప్పటికే (2019 నాటికే) నడిరోడ్డుపైకి పడేశాయి.
2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెద్దఎత్తున మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ఆ నాటి ప్రభుత్వం కొన్ని కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. యావరేజ్ థర్మల్ వేరియబుల్ కాస్ట్ కన్నా ఎంతో అధిక ధరకు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. నిజానికి రెన్యూవబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (ఆర్‌పీపీఓ) నిబంధనల ప్రకారం, మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్ ను 5 నుంచి 11 శాతం తీసుకోవాల్సి ఉంది. కొన్నేళ్ళక్రితం ఏకంగా 23 శాతం పునరు త్పాదక విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల రాష్ట్రం పై పెద్దఎత్తున ఆర్థిక భారం పడింది. దీనివల్ల విద్యుత్ సంస్థలపై కనీవినీ ఎరుగని భారం పడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital