పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు. ప్రధానాలయంలో కొలువైన దత్తాత్రేయునికి షోడశోపచార క్రతువులు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాలంలో అమ్మవారికి లక్షకుంకుమార్చన, ఊయలసేవ, పల్లకీ సేవలను జరిపించారు. అదేవిధంగా ఆలయ ప్రధాన గోపురం నుంచి నందిమండపం మీదుగా బయలుదేన వీరభద్రస్వామిని దర్శించుకుంటూ శ్రీశైల గిరిప్రదక్షిణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు శివనామస్మరణ భజనలు చేస్తూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
శ్రీశైలం చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం కోసం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు.