Saturday, November 23, 2024

ఆర్టీసీ ‘స్లీపర్‌’ సర్వీసులకు ఆదరణ.. వీకెండ్స్‌లో పెద్ద ఎత్తున రద్దీ

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు కొత్త సర్వీసులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఇప్పటికే ఏపీఎస్‌ ఆర్టీసీ మన్ననలు పొందింది. పలు జాతీయ స్థాయి అవార్డులు సైతం ఆర్టీసీ సొంతం చేసుకుంది. ప్రయాణికుల సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీలో అధునాతన ఏసీ బస్సులు ఉన్నాయి. వీటికి తోడుగా ఇటీవల అందుబాటులోకి తెచ్చిన స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. రద్దీ మార్గాల్లో వీటిని ప్రవేశ పెట్టడం ద్వారా ఆర్టీసీ మెరుగైన రవాణా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. స్టార్‌ లైనర్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపధ్యంలో మరికొన్ని కొత్త సర్వీసులపై అధికారులు దృష్టిసారించారు.

స్టార్‌ లైనర్‌ సర్వీసుల ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఏసీ సీటింగ్‌ కమ్‌ స్లీపర్‌ బస్సులను ప్రవేశ పెట్టారు. ఇప్పటికే విశాఖపట్టణం-విజయవాడ మధ్య నడుస్తున్న నైట్‌రైడర్‌ సర్వీసులకు పెద్ద ఎత్తున ప్రయాణికుల ఆదరణ లభిస్తోంది. వారాంతపు రోజుల్లో ఈ సర్వీసుల్లో టిక్కెట్లు దొరకడమే కష్టంగా మారింది. పైగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు నైట్‌రైడర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా సర్వీసులు నడపడంతో పాటు మరిన్ని మెరుగైన సేవలు అందించడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

- Advertisement -

స్టార్‌ లైనర్‌ సర్వీసులకు ఆదరణ..

రాష్ట్రంలో స్టార్‌ లైనర్‌ పేరిట నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇప్పటికే పలు పేర్లతో ఏసీ సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. అయితే ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణం చేసేలా సేవలు అందించేందుక ప్రత్యేక సర్వీసులు నడపాలనే కృతనిశ్చయంతో అధికారులు కసరత్తు చేసి స్టార్‌ లైనర్‌ సర్వీసులను ప్రవేశపెట్టారు. దూర ప్రాంత ప్రయాణికుల ఏమాత్రం అలసటకు లోనుకాకుండా వెళ్లేలా ఈ సర్వీసులను డిజైన్‌ చేశారు. గత ఏడాది వీటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలు, రాష్ట్రేతర ప్రధాన పట్టణాలకు స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు నడుపుతున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో వీటిని నడుపుతున్నారు. రైల్వేలో స్లీపర్‌ కోచ్‌లను తలదన్నేలా స్టార్‌ లైనర్‌ సర్వీసులను రూపొందించారు. సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు నిర్థేశించిన స్టార్‌ లైనర్‌ బస్సుల్లో నాన్‌ ఏసీ కావడంతో తక్కవు మొత్తంలో చార్జీలు ఉండటం కూడా ప్రయాణికులను విశేషంగా ఆకర్షించింది.

నైట్‌రైడర్‌ ఏసీ సర్వీసులు..

నాన్‌ ఏసీ స్టార్‌ లైనర్‌ సర్వీసులకు ఆదరణ పెరిగిన నేపధ్యంలో వేసవిలో నైట్‌ రైడర్‌ పేరిట ఏసీ సర్వీసులు ఏపీఎస్‌ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు సర్వీసులు ప్రయాణికుల సేవలో ఉన్నాయి. 33 సీట్లు, 15 బెర్తులు, 20 సీట్లు, 20బెర్తులు ఉండేటా రెండు రకాల మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రధాన రూట్లలో నడుపుతున్న వీటికి ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తోంది. వారాంతపు రోజుల్లో మరింత డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.

సేవలకే ప్రాధాన్యం..

ప్రయాణికులకు చేరవయ్యేందుకు మెరుగైన సేవలు అందించడమే ఏకైక మార్గంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థాగతమైన నిర్ణయాలతో పాటు ప్రయాణికుల సేవలకు పెద్దపీట వేస్తున్నారు. కొత్త సేవలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రయాణికులకు చేరేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు సహా పలు వర్గాలకు రాయితీలు, దర్శనీయ స్థలాలకు ప్రత్యేక బస్సులు, ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ సేవలు..ఇలా అనేక కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త కొత్త సర్వీసులపై దృష్టిసారించారు. ప్రయాణికుల నుంచి అత్యంత ఆదరణ చూరగొంటున్న స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ, నైట్‌ రైడర్‌ ఏసీ సర్వీసుల నిర్వహణ కూడా ఇందులో భాగమేనని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement