ఇబ్బంది పడిన యంత్రాంగం
గంటల తరబడి క్యూలో ఓటర్లు
మండే ఎండలు.. తాగు నీటికి కష్టాలు
బాత్రూంల సమస్యతో ఆగమాగం
ఈవీఎం వద్ద ఓటు వేయడానికి ఎక్కువ సమయం
పోలింగ్ బూత్ పరిధిలో అధిక ఓటర్లు
పెరిగిన ఓటింగ్ శాతం
ఈసీకి కొరవడిన ప్లానింగ్
రాత్రి 2గంటల వరకు కొనసాగిన పోలింగ్
ఎన్నికల కమిషన్ సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఏపీలో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడం.. ఒక్కో బూత్ పరిధిలో అధిక ఓటర్లు ఉండటం.. ఈవీఎంల వద్ద ఓటు వేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోవడం తదితర కారణాలతో ఓటింగ్ లేట్ అయ్యింది. అంతేకాకుండా ఈ సారి ఓటు వేయడానికి ఎక్కువ మంది ఓటర్లు ఆసక్తి చూపారు.
రికార్డు స్థాయిలో పోలింగ్
రికార్డు స్థాయిలో జరిగిన ఏపీ పోలింగ్ వేళ.. చోటు చేసుకున్న సిత్రాలకు కొదవ లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా 81 శాతానికి మించిన పోలింగ్ నమోదు కావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో.. ఈ పోలింగ్ పై ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఓట్లు వేయటం కోసం నాలుగైదు గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సౌకర్యాలు నిల్
ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయటం కోసం తక్కువలో తక్కువ నాలుగు గంటలు.. గరిష్ఠంగా ఆరేడు గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఓటు వేయటం కోసం క్యూలైన్ లో నాలుగైదు గంటలు నిలబడాల్సి రావటం.. ఆ టైంలో మంచినీళ్లు కూడా కనాకష్టంగా ఉండటం.. బాత్రూం దగ్గర నుంచి మండే ఎండ.. ఉడికించే చెమటతో ఓటర్లు ఆగమాగం అయ్యే పరిస్థితి.
ఓటేసేందుకు ఎక్కువ టైం..
పోలింగ్ గడువు పూర్తయ్యే సమయానికి క్యూ లైన్ లో ఉన్న వారందరి చేతా ఓటు వేయించటం కోసం అర్థరాత్రి రెండు గంటల వరకు కూడా యంత్రాంగం పని చేయాల్సిన రావటం తెలిసిందే. ఎందుకిలా? అన్నప్పుడు బోలెడన్ని కారణాల్ని చెబుతున్నారు. ఈవీఎంలకు గంటకు 120 మంది వరకు ఓటు వేసే వీలు ఉందని చెబుతున్నారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలకు ఓటు వేయాల్సి రావటంతో.. ఈ రెండు ఓట్లు వేసేందుకు సగటున 30 సెకన్లు పడుతున్న పరిస్థితి. ఒక్కో ఈవీఎం గంటకు 120 ఓట్లు వేసే సదుపాయం ఉందని చెప్పినప్పటికీ.. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ఒక్కో ఓటరు తన ఓటు వేయటానికి తక్కువలో తక్కువ నిమిషం నుంచి రెండు నిమిషాల సమయం తీసుకుంటోంది. ఇదొక కారణమైతే.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం ఆరు గంటల పాటు సాగుతుంది. అంటే.. 11 గంటలు. ఒక్కో ఓటుకు 30 సెకన్లు సమయం తీసుకుంటే.. 11 గంటల వ్యవధిలో వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించకునే వీలు ఉంటుంది. ఒకవేళ ఈవీఎంలు మొరాయించినా.. సాంకేతిక సమస్యలు ఎదురైతే మరింత ఆలస్యం అవుతుంది.
పోలింగ్ బూత్‌ల పరిధిలో ఎక్కువ ఓటర్లు
ఏపీలోని పోలింగ్ బూత్ లలో కేటాయించిన ఓట్లు శాస్త్రీయంగా లేవంటున్నారు. సరాసరిన 600-700లకు మించి ఓటర్లు ఉండకుండా ప్రతి పోలింగ్ బూత్ లో ఏర్పాట్లు చేసి ఉంటే..అర్థరాత్రి వరకు ఓటు వేయటం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. పలు పోలింగ్ కేంద్రాల్లో 1200 నుంచి 1350 మంది వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ యాభై.. అరవై శాతం నమోదైతే ఫర్లేదు. కానీ.. 80 శాతానికి పైగా పోలింగ్ జరగటంతో గంటల కొద్దీ ఓట్లు వేయటం కోసం వెయిట్ చేయాల్సిన వచ్చింది. మొత్తంగా ఎన్నికల కమిషన్ కు సరైన ప్లానింగ్ లేకపోవటం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదనే విమర్శ వినిపిస్తోంది. ఏమైనా.. ఓటు వేయటం కోసం గంటల తరబడి ఓటేసిన ఏపీ ఓటర్లకు మాత్రం నిజంగా దండం పెట్టాల్సిందేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.