గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి: రాష్ట్రంలో రాజకీయ శూన్యత ప్రబలుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం లేదా అధికార పార్టీపై వ్యతిరేకత వుండి, అది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మారని సందర్భాలలో రాజకీయ శూన్యత ఏర్పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్తితి ఇలాగే వున్నది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ విషయం ద్యోతకమవుతోంది. ప్రజలలో ప్రభుత్వం పైన కాకుండా అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాపతినిధులపైనే ఎక్కువ వ్యతిరేకత వున్నట్టు గుర్తించారు. దీంతో వైఎస్సార్సీపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ప్రజలలో వున్న వ్యతిరేకత ఇతర పార్టీలకు అవకాశంగా మారకముందే దానిని రూపుమాపే పనిలో నిమగ్నం అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలుచేస్తున్న సంక్షేమ పధకాల పట్ల ప్రజలలో మంచి సానుకూల స్పందనే వ్యక్తమవుతున్నది. అయితే అవి అమలు జరుగుతున్న తీరు, స్థానికంగా వున్న కొంతమంది ఎంఎల్‌ఏ లు, పార్టీ నాయకుల వ్యవహార శైలి పట్ల సామాన్య ప్రజలలోనే కాకుండా వైసీపీ శ్రేణులలో సైతం అసంతృప్తి వెల్లువెత్తుతోంది. దీనిని ముందే పసిగట్టిన అధికార పార్టీ అప్రమత్తం అయింది. పార్టీకి నష్టం చేకూరుస్తున్న నాయకులపై కటిన నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల నుంచి ఎంఎల్‌ఏ లు నాయకుల పనితీరుపై వివిధ మార్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటిని మదింపుచేసి అధినేతకు నివేదించేందుకు ప్రత్యేకంగా అగ్రనాయకులతో కూడిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
విపక్షాలు సఫలం అవుతాయా?
ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతను తమకు అనువుగా మలచుకోవటంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన పార్టీలు పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేదనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జరుపుతున్న పర్యటనలకు ప్రజాస్పందన అనూహ్యంగా వున్నప్పటికి ఎన్నికల సమయం వరకు ఆ ఒరవడి కొనసాగేది అనుమానమే అని ఆ పార్టీ నాయకులే అంతర్గత సంభాషణలలో అంగీకరిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబుపై పూర్తిస్థాయిలో ప్రజల్లో ఇంకా విశ్వాసం కలగలేదనేది వారి మాటల్లో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల ఓటమి నుంచి గుణపాటాలు నేర్చుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతున్న సూచనలు ఆ పార్టీలో కానరావటం లేదు. అంతేగాక పొత్తులతోనే ఎన్నికలలో గెలువగలమన్న భావజాలం ఆ పార్టీలో వ్యాప్తి చెంది వున్నది. వచ్చే ఎన్నికలలో ఏ కారణంచేతనైనా పొత్తులు వికటిస్తే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం సడలి అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం వుంది.
అదేవిధంగా వచ్చే ఎన్నికలలో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన రాజకీయంగా స్థిరమైన వైఖరి కనబర్చలేక తడబడుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే తమ లక్ష్యమని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ అందుకవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న సూచనలు కానరావటం లేదు. బిజెపితో మైత్రి వున్నదా? లేదా? అనే విషయంలో ఆ పార్టీ శ్రేణులకే సందిగ్ధంగా మారింది. ఆ రెండింటి మధ్య స్నేహబంధం ఒకడుగు ముందుకి, రెండడుగుల వెనక్కి అన్న చందంగా తయారయింది.
అయితే బిజెపితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకునే సాహసానికి జనసేనాని ఒడిగట్టలేకపోతున్న సూచనలు కన్పిస్తున్నాయి. అదేసమయంలో బిజెపి సైతం అధికార పార్టీపై అడపాతడపా ధ్వజమెత్తుతున్నప్పటికి అదంతా కేవలం ప్రకటనలకే పరిమితం అయి వున్నది. బిజెపి నాయకత్వం ఆచరణలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు నెలకొని వున్నాయి. ఈ స్థితిలో అధికార పార్టీ కి వ్యతిరేకంగా బిజెపి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవటం అనుమానాస్పదమే. ఈ పరిణామాల నేపధ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేకత బిజెపి లేదా జనసేన పార్టీలకు అనుకూలంగా మారే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.