Friday, November 22, 2024

Political – ఏపీలో థ‌ర్డ్ ఫ్రంట్‌.. వేగంగా పడుతున్న అడుగులు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో … ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో బీజేపీ కూడా చేరేందుకు సిద్ధమవుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో కూటమిలో చేరడంపై స్పష్టత రానుంది. ఆ తరువాత సీట్లను మూడు పార్టీలు పంచుకోనున్నాయి. ఇప్పటికే ఒక కూటమి ఏర్పాటు కాగా.. మరో కూటమి ఏర్పాటునకు రాష్ట్రంలో చాప కింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో ప్రధాని మోదీని గద్దె దించేందుకు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డ పార్టీలు.. ఇక్కడ మరో కూటమికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే మరో కూటమికి కాంగ్రెస్‌ పార్టీ సారథ్యం వహించనున్నట్టు చెబుతున్నారు.

ఇందులో సీపీఐ, సీపీఎంతోపాటు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ ఏర్పాటు చేసిన జై భారత్‌ నేషనల్‌ పార్టీ కూడా ఇందులో చేరబోతున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసే పనిలో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు పని చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

షర్మిల రాకతో కాంగ్రెస్‌లో జోష్‌

కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరిన తరువాత జోష్‌ పెరిగింది. షర్మిల పార్టీలో చేరకముందు నిస్తేజంలో కూరుకుపోయిన కేడర్‌ ఒక్కసారిగా యాక్టివ్‌ అయింది. అధికార, ప్రతిపక్షాలపై తనదైన శైలిలో షర్మిల పదునైన విమర్శనాస్ర్తాలు సంధిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ పార్టీ వాదులుగా ఉన్న ఎంతో మంది మళ్లీ షర్మిల రాకతో కాంగ్రెస్‌ పార్టీ వైపు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో రెండు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఓటు బ్యాంకును సాధించేందుకు అవకాశముందని పార్టీ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తరువాత.. సీట్లు రాని ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌లో చేరతారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అసంతృప్త నేతలకు తలుపులు తెరిచే కాంగ్రెస్‌ పార్టీ ఉంచింది. ఇది కూడా పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతుందని పలువురు చెబుతున్నారు.

బీజేపీకి దూరమే లక్ష్యంతో…

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టేందుకు సీపీఐ, సీపీఎం సిద్ధమవుతున్నాయి. టీడీపీ, జనసేన ఏర్పాటు చేసే కూటమిలో ఈ రెండు పార్టీలు చేరాలని తొలుత భావించాయి. అందుకు అనుగుణంగా ఈ రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత ఈ రెండు పార్టీల కీలక నేతలు లోకేశ్‌తోపాటు ఆ పార్టీ నేతలకు అండగా నిలబడ్డారు. ఒకానొక దశలో ఈ నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పాటు అవుతాయని ప్రచారం జరిగింది. అనూహ్యంగా బీజేపీ కూటమిలో చేరడంతో ఈ రెండు కమ్యూనిస్ట్‌ పార్టీలు టీడీపీ, జనసేనకు దూరంగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో కూటమికి ఏర్పాటుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే కూటమిలో జేడీ లక్ష్మినారాయణ పార్టీ కూడా చేరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో మరో కూటమి ఏర్పాటు అవుతుందనే సమాచారం జోరుగా షికారు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement