Tuesday, November 26, 2024

Political Retirement – రాజకీయాలకు గల్లా ఫామిలీ గుడ్ బై తిరుపతి

(రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : రాయలసీమ పరిధిలోని రాజకీయ కుటుంబాలన్నీ తమ వారసులను వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ఆరేడు శతాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రముఖ రాజకీయ వేత్త తండ్రి రాజగోపాలనాయుడు వారసురాలిగా మూడు దశాబ్దాల క్రితం రాజకీయాలలో అడుగుపెట్టిన గలా అరుణకుమారి 2019 నుంచి దూరంగా ఉంటున్నారు. గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో రెండుసార్లు ఎన్నికైన ఆమె కుమారుడు పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక ముద్ర కలిగివున్న ప్రముఖ రాజకీయ కుటుంబం ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరం అవుతోంది.

రాష్ట్రంలో ఒక అఖిలభారత కాంగ్రెస్ పార్టీ కి జాతీయ అధ్యక్షుడిని, లోక్ సభ ఒక స్పీకర్ ను, శాసన సభ కు ఇద్దరు స్పీకర్లను, రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులను అందించిన సుదీర్ఘ ఘన చరిత్ర చిత్తూరు జిల్లాకు ఉంది.ఆ చరిత్ర లో భాగంగా స్వాతంత్ర ఉద్యమకారుడిగా, రైతు నాయకుడుగా పేరొందిన పాటూరు రాజగోపాలనాయుడు 1950-1960 మధ్యకాలంలో సుప్రసిద్ధ రైతు నాయకుడు ఎన్ జి రంగా సహచరుడుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారిగా తవణంపల్లె నియోజకవర్గం నుంచి 1955లో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా , 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసన సభ కు ఎన్నికయ్యారు. 1964 లో చిత్తూరు ;లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎన్ జి రంగా గెలవడంతో రాజగోపాలనాయుడు కీలక పాత్ర పోషించారు. 1972లో శాసన మండలి సభ్యుడుగా పనిచేసిన రాజగోపాలనాయుడు చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి 1977 లో కాంగ్రెస్ అభ్యర్థిగా , 1980లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.తన రాజకీయ ఎదుగుదలకు ఎన్నో విధాలుగా తోడ్పాటు అందించిన రాజగోపాల నాయుడును తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురువుగా చెప్పుకుంటారు.

తరువాత సామాజిక సేవాకార్యక్రమాలు పరిమితం అయినా రాజగోపాలనాయుడు రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె గల్లా అరుణకుమారి 80 వ దశకం మధ్య కాలంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆమె 1989 లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై 1994-2014 మధ్యకాలంలో అదే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించారు. 2004-2014 మధ్యకాలంలో వై ఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో రాష్ట్ర మంత్రివర్గాలలో పనిచేశారు. ఇక పక్షంగా జరిగిన రాష్ట్ర విభజన ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా ఆ పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరోలో, సభ్యురాలిగా పనిచేశారు.

అదే సమయంలో ఆమెతో పాటు తెలుగుదేశం పార్టీ లో చేరిన ఆమె కుమారుడు, యువ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల సమయానికి జయదేవ్ మరోసారి గుంటూరు నుంచి పోటీ చేసి రెండో సారి లోక్ సభ అభ్యుడయ్యారు. కాగా వ్యక్తిగతకారణాలతో ఆ ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయడానికి విముఖత చూపిన అరుణకుమారి గత ఏడాది క్రియాశీలక రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నట్టు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఇటు శాసన సభ, అటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండుసార్లు గెలిచినా జయదేవ్ కూడా మరో సారి పోటీ చేయడానికి సుముఖత చూపడం లేదు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తన తండ్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్రనాయుడు వారసుడుగా అమర రాజా కంపెనీ కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు రాజకీయ పరమైన కారణాలలో తమ కంపెనీ కి పలు రకాల ఇబ్బందులుఎదురుకావడం, ప్రత్యర్థుల పై ఇతరుల లాగా దిగజారిపోయి విమర్శలు, ఆరోపణలుచేయడానికి మనస్కరించకపోవడం, రాజకీయాలకు అతీతంగా కంపెనీ విస్తరణ పై దృష్టిని సారించాలని నిర్ణయించుకోవడం మౌలిక కారణాలని స్పష్టం అవుతోంది. మొత్తంమీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలపాటు క్రియాశీలక పాత్ర పోషించిన కుటుంబాలలో ఒకటిగా పేరొందిన గల్లా కుటుంబం తాజా ఎన్నికలతో రాజకీయాలకు దూరం కావడం చెప్పుకోదగిన పరిణామంగా చెప్పుకోవచ్చును.

Advertisement

తాజా వార్తలు

Advertisement