Tuesday, November 26, 2024

లూటీల‌ను అరికట్ట‌లేక పోతున్న లాటీలు..

డోన్‌, (ప్రభ న్యూస్‌) : మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా .. తస్మాత్‌ జాగ్రత్త. ఇంటికి తాళం వేసిన సంగతి దొంగలకు తెలిసిందా అంతే సంగతి .. తెల్లారేకల్లా తాళం ఊడి మీకు దర్శనమిస్తుంది. అంతే కాదు ఇంట్లోని వస్తువులు మాయమవుతాయి. గత ఆరు నెలలుగా డోన్‌ పట్టణంలో దొంగలు హల్‌ఛల్‌ సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు నిఘా ఉంచినప్పటికీ వారి కళ్లు కప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

గత నాలుగు నెలల క్రితం డోన్‌ పట్టణంలోని ఏటీఎం సెంటర్‌లో హర్యానాకు చెందిన ఐదుమంది దొంగలు కట్టర్లతో వచ్చి రూ.65లక్షలు కొల్లగొట్టిన సంగతి విధితమే. అలాగే పట్టణంలోని ఇంటి ముందు ఉన్న మోటార్‌సైకిళ్లు కూడా ఎత్తుకెళ్లిన సంఘటనలు కోకొల్లలు. ఇటీవలే సినిమా చూడటానికి వచ్చి పార్కింగ్‌లో ఉంచిన ఆటోను కూడా దొంగలు అపహరించడం జరిగింది. టౌన్‌లోని పాతబస్టాండ్‌ కూడలలో ఉన్న ఒక మొబైల్‌ షాప్‌కు కన్నం వేసి అందులోని సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లడం కూడా చోటుచేసుకుంది. అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాల పక్కనున్న టివి షోరూంలో కూడా దొంగతనం జరిగి టివిలు, హోంథియేటర్లు ఎత్తుకెళ్లడం జరిగింది. బంగారుషాపులో కూడా 50 తులాల బంగారు, రూ.లక్ష నగదు దోచుకెళ్లడం జరిగింది.

అయితే పోలీసులు దర్యాప్తు చేసి బంగారుషాపులో, టివి షాప్‌లో, మొబైల్‌షాప్‌లో పోయిన వాటిని రికవరీ చేయించడం. ఇటీవలే ఏటీఎం దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి కొంత నగదును రికవరీ చేయించారు. అలాగే తక్కువ రేటుతో కొనుక్కున్న సెల్‌ఫోన్లు దొంగల పాలవుతున్నాయే కానీ వాటికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో చాలా మంది ప్రజలు పోలీసుస్టేషన్లను ఆశ్రయించడం లేదు. పట్టణంలో మాత్రం చిల్లర దొంగతనాలు యథేచ్చగా సాగుతున్నాయని వాటిని పోలీసులు అరికట్టకపోతే ఇంకా దొంగతనలు జరిగే అవకాశం ఉంది. డోన్‌లో రైల్వే జంక్షన్ ఉన్నందువల్ల ఇతర రాష్ట్రాల నుండి కూడా దొంగలు ఇక్కడికి వచ్చి దొంగతనాలు చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు మరింత నిఘా ఉంచి పట్టణాన్ని దొంగల నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement