అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి ‘మహాపాదయాత్ర’ ఏడో రోజు ప్రారంభమైంది. ఇవాళ పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కార్తిక సోమవారం సందర్భంగా రేపు పాదయాత్రకు విరామం ప్రకటించారు. యథావిధిగా మంగళవారం నుంచి మళ్లీ సాగనుంది. 45 రోజుల పాటు సాగనున్న యాత్ర తిరుమలలో ముగియనుంది. మరో వైపు ఇవాళ్టి పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో పర్చూరులో రైతుల శిబిరం వద్దకు డీఎస్పీ శ్రీకాంత్ వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకే యాత్ర సాగుతోందని ఐకాస నాయకులు ఆయనకు తెలిపారు. ఎవరైనా వచ్చి సంఘీభావం తెలిపితే తమకు సంబంధం లేదని నిర్వాహకులు వివరించారు. కొవిడ్, ఇతర నిబంధనలు పాటించలేదంటూ పాదయాత్రికులకు ప్రకాశం జిల్లా పోలీసులు నిన్న నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
రెండోరోజు పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో సాగుతున్న మహా పాదయాత్రను ఆంక్షల పేరుతో అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు ప్రజలను ఎక్కడి అక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, అమరావతి రైతులు తలపెట్టిన “న్యాయస్థానం నుంచి దేవస్థాననం” మహాపాదయాత్ర.. ఆరో రోజైన శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ పాదయాత్ర 45 రోజులపాటు సాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకోనుంది.