Thursday, December 12, 2024

AP | నిష్పక్షపాతంగా ప్రజలకు పోలీస్ సేవలు.. హోంమంత్రి అనిత

  • ఏకపక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు..
  • కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న వైసిపి..
  • విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసు నమోదు చేస్తాం..
  • జైల్లో అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుంది..
  • విజయవాడ సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ..
  • (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : నిష్పక్షపాతంగా ప్రజలందరికీ పోలీసు సేవలు అందించాలని, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే విజయ్ సాయిరెడ్డిపై తప్పకుండా కేసు నమోదు చేస్తామన్న ఆమె, జైళ్ల‌ శాఖ అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు. విజయవాడలోని గాంధీ నగర్ లో ఉన్న సబ్ జైలును సోమవారం హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైలు పరిసరాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె అక్కడ అందుబాటులో ఉన్న రికార్డులను కూడా పరిశీలించారు.

సబ్ జైల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఆమె ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి అనిత విలేకరులతో మాట్లాడుతూ… సబ్ జైలులో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావడం జరిగిందన్నారు. జైలులో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇటీవల జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై జైలు రికార్డులు పూర్తిస్థాయిలో తనిఖీ చేశామన్న ఆమె అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుందని, నివేదికల ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదన్నారు.

కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని, వైసీపీ నేతలు గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. రాష్ట్ర సంపదను జగన్ అండ్ కో పూర్తిగా దోచుకుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయిరెడ్డిది కాదని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. అధికారులను బెదిరించి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే ఎప్పటికైనా చర్యలు తప్పవన్నారు. పోలీసులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని, పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement