Tuesday, November 19, 2024

AP | పోలీసుల తనిఖీలు.. టోల్ ప్లాజా వద్ద భారీగా పట్టుబడ్డ నగదు

విశాఖ క్రైం, ప్రభ న్యూస్ : అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదుకు సంబంధించి సరైన పత్రాలు కానీ ఆధారాలు కానీ సరైన వివరణ కానీ ఇవ్వకపోవడంతో సదరు వ్యక్తులపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి నుంచి భారీ నగదు తో పాటు వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నర్సీపట్నం ఏఎస్పి పర్యవేక్షణలో ఈనెల 20న రాత్రి పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో నక్కపల్లి ఎస్ ఐ విభిషణారావు స్థానిక టోల్ ప్లాజా వద్ద నక్కపల్లి పోలీసు స్టేషన్ సిబ్బంది తో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా విశాఖపట్నం వైపు వెళ్తున్నా మహీంద్ర కారును ఆపి చూడగా కారు లోపల ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.

ఆ కారులోని 5 బ్యాగులలో రూ. 2,07,50,000 లు (రెండు కోట్ల ఏడు లక్షల ఏబై వేల రూపాయలు) నగదును గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కారులో లభ్యమైన డబ్బులు ఎక్కడనుండి మీరు తీసుకువస్తున్నారని, సదరు డబ్బులకు ఏమైనా పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా దానికి ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో పాటు నగదు సంబందించి ఎటువంటి పత్రాలు చూపించలేదు.

సదరు వ్యక్తులు ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటామని మాత్రమే తెలియజేయడం జరిగింది. సదరు సొమ్మును అన్క్లైమేడ్ ప్రాపర్టీగా గుర్తించి సదరు సొమ్మును, కారును సీజ్ చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు తెలియజేశారు. కారులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులలో ఇద్దరు కూడా శ్రీకాకులం జిల్లా, ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు (53), యాదవ రాజు (32) లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement