ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల దృష్ట్యా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా భావిస్తున్న చోట అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తాడిపత్రి పట్టణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపార్టీల నేతల నివాసాల వద్ద ముళ్ల కంచె వేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన ఘర్షణ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. దీంతో తాడిపత్రి పట్టణంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈసీ ఆదేశాలతో తాడిపత్రిలోనే సిట్ బృందం మకాం వేసింది. తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై 728మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు… ఇప్పటికే దాదాపు 121మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.