Tuesday, November 26, 2024

Flash: ‘చలో సీఎంవో’.. అరెస్టులతో ఉక్కుపాదం.. సీఎం ఇంటి చుట్టూ ముళ్లకంచె

సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ తీరును ఖండిస్తూ యూటీఎఫ్ తలపెట్టిన “సీఎంవో ముట్టడి” కార్యక్రమంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోరుగర్జన సభ భగ్నం చేసేందుకు… పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడంతో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. టీచర్లెవరూ నిరసనలో పాల్గొనకుండా గృహనిర్బంధాలు, అరెస్టులతో ఉక్కుపాదం మోపారు. సీఎం క్యాంప్ కార్యాలయం చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేసి… భారీ బందోబస్తు మోహరించారు. నిరసనకారులు వెళ్లకుండా ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‎లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ గేట్  వద్ద పొలీసులు తనిఖీలు చేపట్టారు.

ఉపాధ్యాయులు చేపట్టిన సీఎంవో ముట్టడి నేపథ్యంలో ప్రతీ వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ యూటీఎఫ్ నేతలను అరెస్టులు చేస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లే మార్గంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మండలాలవారీగా యూటీఎఫ్ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలను హౌస్ అరెస్టులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement