నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. చేసి వారి వద్ద నుంచి 4 లక్షల 45 వేల రూపాయల 400 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. పోరుమామిళ్ల పోలీసులు నకిలీ నోట్లు ముఠా గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు.
దొంగనోట్ల చెలామణి చేస్తున్న ముఠా కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు పోరుమామిళ్ల పట్టణం నుండి బద్వేలు వెళ్లే ప్రధాన రహదారిలోని వై జంక్షన్ వద్ద దొంగ నోట్ల మూఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి రూ.4,45,400లు విలువ చేసే నకీలీ నోట్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నకిలీ నోట్లల్లో 14 రూ. 2 వేల నోట్లు, 298 రూ.500 నోట్లు, 1297 రూ.200 నోట్లు, 90 రూ.100 నోట్లు ఉన్నాయని వివరించారు. అరెస్టయినవారిలో ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చెందిన పీర్ల ఏసు, పలనాడు జిల్లాకు చెందిన షేక్ కాజా, పాత గుంటూరు జిల్లాకు చెందిన చిట్టి బాబు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా చెందిన చిల్లి ముంత ఏసు,వాడవల్లి నాగేశ్వరరావు, పలనాడు జిల్లాకు చెందిన మధు కుమార్, గుంటూరు జిల్లా దుర్గి మండలం చెందిన కృష్ణమూర్తి, కడప జిల్లా మైదుకూరు కు చెందిన కాసుల పాపారావు ఉన్నట్లు తెలిపారు. నకిలీ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎస్ఐ హరి ప్రసాద్ ను జిల్లా ఎస్పీ రివార్డులతో అభినందించారు.