ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆ వెంటనే పాలనపై ఫోకస్ పెట్టారు..
ఓ వైపు సమీక్షలు, మరోవైపు పర్యటనకు సాగిస్తున్నారు.. ఇక, నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన.. తొలి సారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబా కబు పూనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధా న్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మొత్తంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తన మొదటి పర్యటనను పోలవరంతో ప్రారంభించనున్నారు.
ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడంతోపాటు, ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి ఉదయం 11.45 గంటలకు చేరుకుంటారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 1. 30 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 1. 45 గంటలకు ప్రాజెక్ట్ అతిధి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2. 05 గంటల నుండి 3.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్ సైట్ నుండి హెలికాప్టర్ లో తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు .