Friday, October 18, 2024

Polavaram – సీపేజీని అడ్డుకోలేం .. నిరోధం అసాధ్యం – పోల‌వ‌రంపై నిపుణుల క‌మిటీ రిపోర్టు

పోల‌వ‌రంపై నిపుణుల క‌మిటీ రిపోర్టు
కొంత నీరు గ్రావిటీతో త‌ర‌లించాలి
మిగిలిన నీళ్లు త‌ప్ప‌కుండా ఎత్తిపోయాల్సిందే
భూమి పొర‌ల్లోని వ్యాత్యాసాల‌ను ప‌రిశీలించాలి
ఫీజో మీటర్లతో నేల తీరును అంచనా వేయాలి
వ‌ర‌ద‌ల‌తో ఏర్ప‌డ్డ అగాథాలను ఇసుకతో పూడ్చాలి
బంక‌మ‌ట్టితోనే గైడ్ బండ్‌కి పెద్ద దెబ్బ‌
నిర్మాణ ప‌టిష్ట‌త కోసం మ‌రికొన్న ప‌రీక్ష‌లు అవ‌స‌రం
తాత్కాలిక నివేదిక‌లో పేర్కొన్న‌ నిపుణుల బృందం

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్‌ ప్రాంతంలోని సీపేజీని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని, సీపేజీ నీటిని ఎత్తిపోయాల్సిందేనని విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. గురువారం పోల‌వరంపై జ‌రిపిన ప‌రిశీల‌న‌లు, ప‌రిశోధ‌న‌ల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి నిపుణుల బృందం అంద‌జేసింది. కాగా, కొంత నీరు గ్రావిటీ ద్వారా, మిగిలిన నీళ్లు ఎత్తిపోయాలని ఈ బృందం సూచించింది. దానికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపింది. డ్యామ్‌ల‌ భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్‌ అంశాల్లో విశేష అనుభవం కలిగిన డేవిడ్‌ బి.పాల్, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌ అందరూ కలిసి చర్చించుకుని, కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు.

- Advertisement -

డ‌యాఫ్రం వాల్‌పై నిర్ణ‌యం రాలే..

కాగా, డయాఫ్రం వాల్‌పై నిర్ణయాన్ని తుది నివేదికలోనే నిపుణుల బృందం వెల్లడించనుంది. సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ ఈ నివేదికను రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు పంపి ఎలా ముందుకు వెళ్లనున్నారో, ఆ ప్యానెల్‌ సూచించిన పరీక్షలను ఎలా చేపడతారో తెలియజేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలోని సీపేజీని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు నిర్వహించాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది. మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చిచెప్పింది.

ఫీజో మీటర్లతో సీపేజీ గుర్తించాలి

ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే +17 మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సీపేజీ నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఎగువ కాఫర్‌ డ్యాం భద్రత, సీపేజీ ఈ డ్యాంలో నుంచే జరుగుతోందా లేదా అనే విషయాలు నిర్ధారించేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఎక్కడెక్కడ బోర్‌హోల్స్‌ ఎలా వేయాలి? పరీక్షలు ఎలా నిర్వహించాలో తెలిపారు. కొన్ని గుంతల జంక్షనులో, మరికొన్ని ఇసుక ఉన్నచోట, మరికొన్ని క్లే కోర్‌ ఉన్నచోట వేసి సీపేజీ ఉందా లేదా అన్నది పరీక్షించాలని నిర్దేశించారు. కొన్నిచోట్ల ఫిజోమీటర్లు ఏర్పాటుచేయాలని వాటి ఆధారంగా సీపేజీని గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు. దిగువ కాఫర్‌ డ్యాంలో ఎక్కడెక్కడ ఎంతమేర గుంతలు వేసి పరీక్షలు చేయాలో సిఫార్సు చేశారు. ఈ కట్టడాల నుంచి సీపేజీ ఉందని తేలితే తదనుగుణంగా ట్రీట్‌మెంట్‌ ప్రణాళికలు తెలిపారు. ఈ పరీక్షల నివేదికలు విదేశీ నిపుణులకు పంపాలని తెలిపారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో 2020 భారీ వరదల వల్ల అగాథాలు ఏర్పడ్డాయి. అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి.

అగాథాలను ఇసుకతో పూడ్చాలి

డ్యామ్ నిర్మించాలంటే అక్కడ ఆఅగాథాలను ఇసుకతో నింపి సాంద్రత పెంచాలని ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం తేల్చింది. ఆ పనులు జరుగుతున్నా కొన్నిచోట్ల ఇసుక సాంద్రత పెంచే పనులు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్కడ 20 మీటర్ల లోతు వరకు ఇలా ట్రీట్‌మెంట్‌ చేయాలని, కొన్నిచోట్ల 10 మీటర్ల కన్నా దిగువకు వెళ్లడం సాధ్యం కావడం లేదని, ఆ ప్రాంతాల్లో మల్టీఛానల్‌ ఎనాలసిస్‌ ఆఫ్‌ సిస్మిక్‌ రేస్‌ పరీక్షలు చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. దీనివల్ల ఆ దిగువన ఉన్న ఇసుక సాంద్రత ఎంతవరకు పెంచగలిగారు, భూ భౌతిక పరిస్థితులు నిర్మాణ పనులకు తగ్గట్టుగా మారాయా లేదా అన్నది తేలుతుందని స్పష్టంచేసింది. ఒకవేళ సాంద్రత పెరగకపోతే ఎక్కడెక్కడ ఇంకా డెన్సిఫై చేయాలో తెలుస్తుందని అప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో పరిష్కారాలు సూచిస్తామని నిపుణుల బృందం పేర్కొంది.

బంకమట్టితోనే గైడ్ బండ్ కు దెబ్బ

పోలవరం ప్రాజెక్టులో గతంలో గైడ్‌బండ్‌ కుంగిపోయింది. రెండు వేర్వేరు సీజన్లలో పనులు చేయడం వల్ల బంకమట్టి రేణువులు అక్కడి స్టోన్‌ కాలమ్‌లలో చేరటంతో గైడ్‌బండ్‌ కుంగిందని తేల్చారు. అదే తరహాలోనే గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం నిర్మాణ పనులూ చేపట్టారు. కొంతమేర ఆ పనులు జరిగాయి.ఈ నేపథ్యంలో గ్యాప్‌ 1 ప్రధాన డ్యాంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణ పటిష్ఠత తేల్చేందుకు పరీక్షలు చేయాలని నిపుణులు సిఫార్సు చేశారు. ఆ స్టోన్‌ కాలమ్‌లలోకి రంధ్రాలు చేసి నీటిని పంపాలన్నారు. అలా పర్మిబులిటీ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేశారు. అక్కడ ఎంత నష్టం జరిగిందన్న అంశాల ఆధారంగా వాటి సామర్థ్యాన్ని తేల్చి చెప్పవచ్చని నిపుణుల బృందం పేర్కొంది.

కొన‌సాగుతున్న విశ్లేష‌ణ‌..

ఈ పరీక్షలు చేసి ఫలితాలను నిపుణుల బృందానికి పంపాలని సూచించారు.ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో కొంతమేర బంకమట్టి నేలలు ఉన్నాయి. ఇక్కడ వరదల వల్ల ఎప్పటికప్పుడు కొత్త మట్టిపొరలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రాంతంలో ప్రతి పొరనూ విశ్లేషించేలా నిపుణులు కొన్ని సిఫార్సులు చేశారు. బంకమట్టి నేలపొరల మధ్య ఇసుక పొరలు ఉన్నాయా అన్నది పరీక్షించాలని సిఫార్సు చేశారు. ప్రధాన రాతి, మట్టి డ్యాం పనులతో పాటు డయాఫ్రం వాల్‌ గురించి తుది నివేదికలోనే వారి అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement