కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా మాట్లాడిన షెకావత్ ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. ఏపీకి జీవనాడిగా పోలవరాన్ని అభివర్ణించిన షెకావత్… జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. రెండు రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన షెకావత్ శుక్రవారం ఉదయం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు నిర్వాసిత కాలనీలను కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షెకావత్.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని.. వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.