అమరావతి, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిజైన్ల ఆమోదంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశించుకున్న కాలపరిమితిలోపు పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేయాలనీ, దిగువ కాఫర్ డ్యాం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం డిజైన్ల తుది ఆమోదానికి అవసరమైన సంప్రదింపులు చేయాలన్నారు. డౌన్ స్ట్రీం (దిగు) కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని అధికారులు తెలపటంతో ఈసీఆర్‌ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని సీఎం తెలిపారు. కేంద్ర జలశక్తితో పాటు- డిజైన్ల ఆమోదానికి సంబంధించిన వివిధ విభాగాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ వెంటపడి పనులు చేయించుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన అంకమైన సహాయ పునరావాస (ఆర్ అండ్ ఆర్)పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో ముంపు ప్రాంతాల నుంచి కుటు-ంబాలను తరలిస్తున్నామనీ, ఆగస్టు కల్లా తొలి ప్రాధాన్యతలో ఉన్న వారందరినీ పునరావాస కాలనీలకు తరలిస్తామని తెలిపారు. తొలి ప్రాధాన్యతలో ఉన్న 20946 కుటు-ంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించాం.. 3228 మంది ఓటీ-ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు..మరో 9756 కుటు-ంబాలను తరలించాల్సి ఉందన్నారు. తొలి ప్రాధాన్యతలో ఉన్న వారందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలనీ, డీబీటీ- పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మిగతా ప్రాజెక్టులపైనా దృష్టి..
పోలవరంతో పాటు- రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతీ, ప్రాధాన్యతలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్-2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1,2 పనుల పురోగతి, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్ -2లో ఫేజ్-2 పనుల పురోగతిపై అధికారులనడిగి వివరాలు తెలుసుకున్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్ 1 పనులు ఈ ఏడాది సెప్టెంబరులోపు పూర్తి కావాలనీ, అదే నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవం చేయాలని అధికారులను ఆదేశించారు. టన్నెల్-2 పనుల పురోగతిపైనా సమీక్షా సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నామనీ, 500 మీటర్ల మేర పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వచ్చే ఏడాది టన్నెల్-2 పనులు పూర్తవుతాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి వచ్చే ఏడాది రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటు-న్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించేందుకు -టె-ండర్లు పిలవాలని సమావేశంలో సీఎం ఆదేశించారు.
గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా నోటిఫై చేయండి..
సంగం బ్యారేజ్ ను మేకపాటి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా వెంటనే నోటిఫై చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంగం బ్యారేజీ పనులు తుది దశలో ఉన్నాయనీ, ముందుగా నిర్ణయించినట్టు- మే 15 నాటికి బ్యారేజ్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు. అవుకు టన్నెల్-2లో మిగిలిపోయిన 77.5 మీటర్ల మేర పనులను ఈ సీజన్‌లో పూర్తి చేస్తామనీ, 120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దిశా నిర్దేశం..
ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపైనా సీఎం ఈ సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వంశధార-నాగావళి పనులను ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిప్ట్n చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసేలా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణంపైనా సీఎం అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపుగా ఏపీనే భరిస్తోందనీ, ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారకరామ తీర్థసాగర్, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల పురోగతిపైనా సీఎం అధికారులతో చర్చించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేయాలనీ, ఆర్థికశాఖ నుంచి అనుమతులు తీసుకుని -టె-ండర్లు పిలవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, సహాయ పునరావాస (ఆర్ అండ్ ఆర్) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..