Tuesday, November 26, 2024

కొలిక్కిరానున్న పోలవరం డయాఫ్రం వాల్‌.. ఫిబ్రవరి 5 లోపు జలశక్తికి ఎన్‌.హెచ్‌.పి.సి నివేదిక

అమరావతి, ఆంధ్రప్రభ : పోలవరం డయాఫ్రం వాల్‌ ఇంజనీరింగ్‌ నిపుణులకు సవాల్‌ విసురుతోంది. 2020లో వచ్చిన భారీ వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని కూడా అదుపు చేస్తోంది. డయాఫ్రం వాల్‌ను పూర్తిగా పునర్నిర్మాణం చేయటమా, దెబ్బతిన్న కట్టడాన్ని తొలగించి అక్కడి వరకే నిర్మాణాన్ని పరిమితం చేయటమా అనేది ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఎన్నో ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ సంస్థలతో అధ్యయనం చేయించిన కేంద్ర జలశక్తి నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (జాతీయ జలవిద్యుత్‌ బోర్డు – ఎన్‌.హెచ్‌.పి.సి) కొత్తగా అందించే నివేదిక మేరకు తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చేనెలలోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణంపై తుది నిర్ణయాన్ని ప్రకటించి ఆ మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన డిజైన్‌ కు ఆమోదం తెలపనున్నట్టు కీలక సమాచారం. దీనిపై ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ)కు మార్గ నిర్దేశం చేసినట్టు తెలిసింది. డయాఫ్రం వాల్‌ను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేదనీ, కట్టడం ఎంత వరకు ధ్వంసమై నిరుపయోగంగా ఉందో ఆ మేరకు సమాంతర డయా ఫ్రం వాల్‌ను నిర్మిస్తే సరిపోతుందని ఎన్‌ హెచ్‌ పీఎస్‌ బృందం ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

దీని కోసం చేపట్టాల్సిన సాంకేతిక చర్యలను ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి 5 లోపు తుది నివేదికను అందించనున్నట్టు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో నిష్ణాతులైన ఎ.ఎస్‌.రాజు, గోపాలకృష్ణ, హర్వీందర్‌సింగ్‌, హసన్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఛైర్మన్‌ పాండ్యా తదితరులు గతంలో వేర్వేరుగా అందించిన నివేదికలకు ఎన్‌.హెచ్‌.పి.సి తాజా అధ్యయనం కూడా దగ్గరగా ఉండే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ నిపుణులు భావిస్తున్నారు. పోలవరం డయాఫ్రం వాల్‌ పై కేంద్ర జలశక్తి ఇప్పటికే సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-చెన్నై ఇంజనీరింగ్‌ నిపుణులతో అధ్యయనం చేయించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) వాటిని అధ్యయనం చేసింది. ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్‌, రిటైర్డు ప్రొఫెసర్‌ వీఎస్‌ రాజు నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను కూడా కొంత మేర పరిగణలోకి తీసుకుంది.

- Advertisement -

అన్ని నివేదికల పరిశీలన అనంతరం తుది అధ్యయన బాధ్యతలను ఎన్‌.హెచ్‌.పీ.సీకి కేంద్ర జలశక్తి అప్పగించింది. ఈ మేరకు గత ఏడాది రెండు విడతలుగా డయాఫ్రం వాల్‌ ను పరిశీలించిన ఎన్‌.హెచ్‌.పీ.సీ బృందం ఈనెల 25న తుది పరీక్షలు నిర్వహించింది. ఎన్‌.హెచ్‌.పి.సికి చెందిన హరియాణా ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం ప్రత్యేకమైన సాంకేతిక పరికరాలను వెంట తీసుకొచ్చి నిశితంగా పరీక్షలు నిర్వహించింది. చేపట్టాల్సిన పనులపై ఇక్కడి ఇంజనీరింగ్‌ నిపుణులకు అవగాహన కల్పించింది. నదీగర్భంలో కొన్ని చోట్ల 90 అడుగులు, మరికొన్ని చోట్ల 300 అడుగుల లోతున పటిష్టమైన రాళ్లను గుర్తించి అక్కడ నుంచి డయాఫ్రం వాల్‌ ను గతంలో నిర్మించారు. ఈ దశలో ఎన్‌.హెచ్‌.పీ.సీ బృందం డయాఫ్రం వాల్‌ ఏ మేరకు దెబ్బతిందనే అంశాన్ని పరిశీలించేందుకు హై రిజల్యూషన్‌ జియో ఫిజికల్‌ రెసిప్టివిటీ ఇమేజింగ్‌ విధానంతో పాటు సిస్మిక్‌ టోమోగ్రఫి పరీక్షలు నిర్వహించారు. దీని కోసం వరద నీటినంతా తోడేశాక 2120 ఎలక్ట్రోడ్లను ఏర్పాటు చేశారు. డయాఫ్రం వాల్‌ పొడవు 1.38 కిలోమీటర్లు. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌ ఎంత పొడవు ఉందో అక్కడ టోమోగ్రాఫిక్‌, ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ విధానాన్ని అనుసరించి అక్కడ ఏర్పాటు చేసిన 2120 ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్‌ను ప్రవహింపచేసి సామర్ద్య పరీక్షలు నిర్వహించారు.

తగ్గనున్న వ్యయం..

నదిలో కోతకు గురయిన ప్రాంతాన్ని తిరిగి ఇసుకపొరలతో పటిష్టం చేయటం, గుంతల నుంచి నీటిని తోడటం, డయా ఫ్రం వాల్‌ పునర్నిర్మాణానికి రూ 2,100 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. డ్రెడ్జింగ్‌ విధానాన్ని అవలంబించి ఇసుక కోత సమస్యను అధిగమించవచ్చనీ..దీనికి రూ 880 కోట్లు సరిపోతాయని గతంలో ఇంజనీరింగ్‌ నిపుణులు నివేదిక అందించారు. డయాఫ్రం వాల్‌ ను పూర్తిస్థాయిలో పునర్నిర్మించే అవసరం లేకపోతే ఇపుడు ఎన్‌ హెచ్‌ పీసీ అందించే తాజా నివేదిక ప్రకారం ఎంత ఖర్చవుతుందనే అంశాన్ని కూడా కేంద్ర జలశక్తి పరిగణలోకి తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement