వెలగపూడి – ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.45గంటలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు.
అక్కడ ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రనిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. 10.50 గంటలకు బయల్దేరి పోలవరం ప్రాజెక్టు సైట్‌లోకి వెళతారు. 12.05 గంటల వరకు గ్యాప్-1, వైబ్రో కాంపాక్షన, గ్యాప్-2 పనులను పరిశీలించి డయాఫ్రంవాల్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి 12.20 గంటలకు పోలవరం గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 12.50 గంటల వరకు పోలవరం ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ పరిస్థితిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. 1.25 గంటలకు హెలికాఫ్టర్లో బయల్దేరి 2.15 గంటలకు వెలగపూడిలోని సెక్రటేరియట్‌కు చేరుకుంటారు.
ప్రాజెక్టును సందర్శించిన తర్వాత పనులను వేగవంతం చేయడానికి అవసరమైన షెడ్యూల్‌ను చంద్రబాబు ఇక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో సీఎం హోదాలో చంద్రబాబు పోలవరం పనులను పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం పోలవరం వచ్చేవారు. 2019కి సుమారు72 శాతం పనులు పూర్త చేయించారు. స్పిల్‌వే గేట్లు కూడా పెట్టి ఒక కొలిక్కి తెచ్చారు. ఎగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రంవాల్‌లను నిర్మించారు. దిగువ కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టారు.
కుడి ప్రధాన కాలువ పనులను ఒక కొలిక్కి తేగా, ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. మరోపక్క పోలవరం విద్యుత ప్రాజెక్టు పనులను కూడా మొదలు పెట్టించారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రివర్స్ టెండరింగ్, ఎంక్వయిరీలు అంటూ జాప్యం చేసి, చివరకు ప్రాజెక్టును కదలకుండా చేసిన సంగతి తెలిసిందే.