Tuesday, November 26, 2024

పోలవరం సవరించిన అంచనాలపై అవగాహనకు వచ్చాం: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల కమిటీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో శుభ సమాచారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని కార్యాలయ అధికారులతో పాటు ఆర్థిక, జలశక్తి, ఉక్కు, విమానయాన, మైనింగ్ శాఖల కార్యదర్శులు పాల్గొనగా, విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సహా మరికొందరు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇటీవల ప్రధాన మంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేకాంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రధాని అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారం కోసం కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిందిగా ఆదేశించారు. ప్రధాని ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ ఆర్థిక శాఖ కార్యాలయంలో భేటీ జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధానంగా 7 అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాలకు సిద్ధపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయాన్ని వెచ్చించి అన్ని అంశాలపై కూలంకశంగా చర్చించారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పరిహారం, పునరావాసంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సవరించిన అంచనాలను జలశక్తి శాఖ ఆమోదించినప్పటికీ, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి చాలాకాలంగా ఎలాంటి కదలిక లేదు. ప్రధానితో జరిగిన సమావేశంలోనూ సీఎం జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడ్డ రెవెన్యూ లోటు సైతం కేంద్రం పూర్తిగా భర్తీ చేయలేదు. కాగ్ లెక్కించిన మేరకు రెవెన్యూ లోటును పూర్తిగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు అంచనా మరోవిధంగా ఉండడంతో ఈ అంశం చాలాకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయింది. దీనిపై అధికారులు లోతుగా చర్చించినట్టు తెలిసింది.

విశాఖపట్నం నగర విమానయాన అవసరాలు తీర్చే భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ను రెన్యువల్‌ చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం కేంద్రానికి తెలియజేసింది. సమావేశంలో ఉన్న విమానయాన శాఖ కార్యదర్శి వెంటనే సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

- Advertisement -

వైయస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి మెకాన్‌ సంస్థ సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలను పరిశీలించి వీలైనంత త్వరగా నివేదిక అందజేసేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలని కేంద్ర గనుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్‌ 2నుంచి 2017 జూన్‌ 10 వరకు విద్యుత్‌ను అందించినట్టు జెన్‌కో చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్దిష్ట ఆదేశాల మేరకు ఆ విద్యుత్‌ పంపిణీ జరిగిందని, ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం రూ.6,284 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రతినిధుల బృందం గుర్తుచేసింది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని వివరించింది. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలియజేసింది. వీలైనంత త్వరగా ఈ బిల్లులను చెల్లించేలా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హత ఉన్నప్పటికీ చాలా మంది జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రావడంలేదని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా రేషన్ అందిస్తోందని వివరించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరుగుతోందని, రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఆ మేరకు ఎక్కువ మంది లబ్ధిదారులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకొచ్చేలా చూడాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఎన్‌బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

సమావేశం సానుకూలం.. త్వరలో మంచి సమాచారం: విజయసాయి రెడ్డి

కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి, రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశం ఫలప్రదమైందని అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అందించిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించామని తెలిపారు. త్వరలోనే మంచి సమాచారం వస్తుందన్న ఆశాభావాన్ని విజయసాయి రెడ్డి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. దీనికి కొనసాగింపుగా, సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిష్కారమయ్యేలా చూస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయన్నారు. రెవెన్యూలోటుపై కూడా చర్చించామని, బడ్జెట్ సమయంలో బిజీగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం కేటాయించారని సాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశమే నిదర్శనమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement