Monday, November 25, 2024

AP | సీఫుడ్‌ కంపెనీలో విషవాయువు లీక్‌.. స్పృహ కోల్పోయిన 16 మంది కార్మికులు

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో/ జరుగుమల్లి: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద ఉన్న మున్నంగి సీఫుడ్‌ కంపెనీలో విషవాయువు లీకై 16 మంది కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఫీఫుడ్‌ కంపెనీలో చేపలను ప్రాసెసింగ్‌ చేస్తున్న సమయంలో అమ్మోనియం గ్యాస్‌ లీక్‌ కావడంతో ఆ వాయువును పీల్చిన సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో 16 మంది కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటీనా ఒంగోలు జీజీహెచ్‌కు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

బాధిత కార్మికులంతా ఒడిశాకు చెందిన వారు. పొట్టకూటికోసం ఇక్కడికి వచ్చి రోజువారి కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న వారు కావడం గమనార్హం. అయితే మున్నంగి సీఫుడ్‌ కంపెనీలో జరిగిన అమ్మోనియం గ్యాస్‌ లీకేజీ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సర్వత్రా భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. బాధిత కార్మికులను హుటాహుటీనా జీజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించారు. అయితే దీని పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్నంగి సీఫుడ్స్‌లో విషవాయువు లీకేజీలో కుట్ర కోణం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కార్మికులకు ప్రాణహాని లేదు : జిల్లా కలెక్టర్‌
జరుగుమల్లి మండలం వావిలేటిపాడులోని మున్నంగి సీఫుడ్స్‌లో పని చేస్తున్న కార్మికులకు ఎవరికీ ప్రాణపాయం లేదని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రకటించారు. కార్మికుల అస్వస్థతకు అమోనియం లీకేజీ కారణం కాదని వెల్లడించారు. 16 మంది కార్మికులకు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలన్నారు .వారందరినీ ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించి 15 మందిని డిశ్చార్జ్‌ కూడా చేయడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

- Advertisement -

మెరుగైన వైద్యం అందించాం : జీజీహెచ్‌ సూపరిటెండెంట్‌
మున్నంగి సీ ఫుడ్‌లో పని చేస్తూ అస్వస్థతకు గురై జీజీహెచ్‌లో చేరిన మహిళా కార్మికులకు మెరుగైన వైద్యం అందించామని జీజీహెచ్‌ సూపరిటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌నాయక్‌ తెలిపారు. వీరి ఆరోగ్యం గురించి జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారన్నారు. వారి ఆరోగ్యం గురించి స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. బుధవారం ఉదయం 16 మంది ఒరిస్సాకి చెందిన మహిళా కార్మికులు అస్వస్థతతో జీజీహెచ్‌లో చేరారని తెలిపారు. వారికి తక్షణ వైద్యం అందించామని, వారందరు జ్వరంతో బాధపడుతున్నారని, కార్మికులందరికీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని, ఈసీజీ పరీక్షలు చేశామన్నారు. వైద్యం అందించిన అనంతరం సాయంత్రానికి అందరూ కోలుకున్నారని సూపరిటెండెంట్‌ భగవాన్‌ నాయక్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement