- పీఎంఈజీపీ, ఉపాధికి ఊతం, ఉన్నతికి మార్గం..
- 2025, జనవరిలో కార్యక్రమంపై స్పెషల్ డ్రైవ్..
- నియోజకవర్గాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు…
- వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర – 2047 దిశగా సమష్టిగా అడుగేద్దాం..
- విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : స్వయం ఉపాధితో పాటు మరో పది మందికి ఉపాధి చూపేందుకు, జీవితంలో ఉన్నతికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమంపై జనవరిలో నియోజకవర్గాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. పీఎంఈజీపీపై పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రా, వికసిత్ ఎన్‌టీఆర్ జిల్లా కోసం సమష్టిగా అడుగులేద్దామని పేర్కొన్నారు. యువత ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి మార్గాలను చూపడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ క్రమంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకమైన పీఎంఈజీపీపై పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికత అయిన వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సాకారం దిశగా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో ఎన్‌టీఆర్ జిల్లా ఆదర్శవంతంగా నిలిచేలా కృషిచేస్తున్నట్లు ఎంపీ శివనాథ్ తెలిపారు.
చేయిపట్టి నడిపించాలి…
పారిశ్రామికంగా, ఉపాధి కల్పన పరంగా జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చేయిపట్టి నడిపించాలని అధికారులకు కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సూచించారు. జిల్లాలో దాదాపు 40వేల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని.. ఒకవైపు వృద్ధికి చోదక శక్తి అయిన ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే మరోవైపు యువతను పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పీఎంఈజీపీపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించి బిజినెస్ ఆలోచన మొదలు, ప్రాజెక్టు రూపకల్పన, దరఖాస్తు విధానం, రాయితీ, రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు, యూనిట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక.. ఇలా ప్రతి అంశంపైనా అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
పీఎంఈజీపీ ద్వారా దాదాపు 1,056 రకాలకు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశముందని వివరించారు. స్వర్ణాంధ్ర – 2047 సాధన దిశగా వివిధ శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి జిల్లాను ముందంజలో నిలుపుదామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.