Tuesday, November 26, 2024

ఒంటిపూట బడులు 1 నుంచి.. జూన్‌లో వేసవి సెలవులివ్వాలని యోచన..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులను ఈ నెల 15వ తేదీ నుంచే నిర్వహించాలని ప్రతిపాదనలు అందినప్పటికీ.. సిలబస్‌ పూర్తి కానందున నెలాఖరు వరకు రెండు పూటలా తరగతులు నిర్వహించాలని, ఏప్రిల్‌ ఒకటి నుంచి ఒక పూటకు కుదించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) తేదీల్లో మార్పులు చేయడంతో ఇంటర్‌ పరీక్షల తేదీలను మరోసారి మార్చనున్నారు. ఇప్పటికే పరీక్షల మధ్య జేఈఈ తేదీలు రావడంతో ఒకసారి మార్పు చేసి షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాల దృష్ట్యా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జేఈఈ తేదీలనే మారుస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షా తేదీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. పదో తరగతి పరీక్షా తేదీలు, జేఈఈ తేదీలు కలవకుండా వీటిని ప్రకటించే విషయంపై ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవైపు పదో తరగతి పరీక్షా తేదీలనూ మార్చాలని, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగే సమయంలోనే నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలు, సమయం, సిబ్బంది విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులోగా పది పరీక్షలను నిర్వహించే అంశంపై పరిశీలన జరుగుతోంది. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూళ్లు ఖరారైన తర్వాత పరీక్షలు పూర్తయిన నాటి నుంచి ఆయా తరగతుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మే నెలాఖరు వరకు ఉపాధ్యాయులకు పూర్తి పనిదినాలు ఉండనున్నాయి. జూన్‌ నెల మొత్తం వారికి సెలవులు ఇచ్చే అవకాశముంది. వీటన్నింటిపై ఈ వారంలోనే స్పష్టత రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement