ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం… రాష్ట్రంలో మరో నాలుగు కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల విజన్ వల్ల రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సత్యకుమార్ ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూరులోని నాగార్జునసాగర్, శ్రీకాకుళంలోని మూల్‌పేటలో విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ పెరిగి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని సత్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు.