అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఆరోపణలు
కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు
నీదే తప్పంటే.. నీదే అని కొట్టుకున్న అధికారులు
జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించిన సిబ్బంది
ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం : ఫిఠాపురంలో కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మీడియా సాక్షిగా.. ఉన్నతాధికారులు ఉచితానుచితాలను విస్మరించారు. బూతుల పంచాగంతో ప్రజాప్రతినిధులకు ఉచిత వినోదం పంచారు. ఈ వినోదాన్ని ఏపీ ప్రజలకు సోషల్ మీడియా సమర్పించింది. శనివారం పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవాని శంకర్ బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సమాధానం డి.ఈ.ఈ గా ఉన్న భవానీ శంకర్ కు కోపం తెప్పించింది. ఎందుకంటే ఆయననే తప్పు పడుతూ సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే డీఈఈ భవానీ శంకర్ లేచి.. కమిషనర్ కనకారావుపై ప్రత్యారోపణలు చేశారు. మెల్లగా వివాదం ముదిరింది. మొదట తిట్టుకున్నారు. తర్వాత నెట్టుకున్నారు. ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దుకున్నారు.
కమిషనర్ , డీఈఈ మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరాటం
అధికారులు కొట్టుకోవడం ప్రారంభించడంతో కౌన్సిలర్లు అవాక్కయ్యారు. వెంటనే కొంత మంది తోటి ఉద్యోగులతో పాటు.. కౌన్సిలర్లు వారిని విడదీసి బయటకు పంపే ప్రయత్నం చేశారు. చాలా సేపటి వరకూ వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం చాలా కాలంగా నడుస్తోందని చెబుతున్నారు. మొదటి నుంచి పిఠాపురంలో పని చేస్తున్న వీరిద్దరూ అధికార పార్టీ సాయంతో హవా చెలాయిచేవారు. అయితే తర్వాత వారి మధ్య వివాదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కీలక అధికారులు సెలవులు పెట్టి వెళ్లిపోయారు. వారిలో కమిషనర్ కూడా ఉన్నారు.