ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేపింది. కాళ్లకి చైనాకి సంబంధించిన ట్యాగ్ ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. పావురం కుడికాలుకి పసుపు రంగుతో ఉన్న ట్యాగ్ను గమనించారు. ట్యాగ్పై AIR 2207 అనే కోడ్ నంబర్ ఉంది.ఇది చైనాకు చెందిన పావురమా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పావురాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఒడిశా రాష్ట్రంలో కూడా ఇదే తరహలో పావురాలు కలకలం రేపుతున్నాయి. ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా పావురాలు స్థానికులకు చిక్కాయి. వీటి కాళ్లకు సైతం ట్యాగ్లు ఉంటడం గమనార్హం. కోడ్ నంబర్లతో కూడిన రబ్బర్ ట్యాగ్‌లు ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం(జనవరి 3) ఒడిశాలోని రవురెక్కలాలో, మంగళవారం కేంద్రపడ జిల్లా మార్ సగై పోలీస్ స్టేషన్ పరిధి దశరథపుర్‌లో మరోటి దొరికాయి. వీటిలో ఒక పావురం కాలికి వీహెచ్ఎఫ్, వైజాగ్, 19742021 అని ముద్రించి ఉంది. మరో పావురం కాలికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ ఉన్నాయి. అయితే ఈ పావురాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిశాలో దొరికిన పావురం పెంపుడు పావురంగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పావురం కాలుకు ఉన్న ల్యాగ్ పై చైనా అక్షరాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
పావురం కాలుకు ఉన్న ట్యాగ్ పై ఉన్న బ్యాడ్జ్ పై కొన్ని చైనీస్ అక్షరాలు ఉన్నాయని రాజ్‌గంగాపూర్ ఎస్‌డీపీఓ శశాంక్ శేఖర్ చెప్పారు. అయితే పావురం కాలుకి ఎలాంటి ఎలక్ట్రానిక్ చిప్ లేదా పరికరం జోడించలేదని ఆయన చెప్పారు. వివిధ దేశాల ప్రజలు తమ పెంపుడు జంతువులు, పక్షుల గుర్తింపు కోసం బ్యాడ్జ్‌లు, ట్యాగులు ఉంచుతారు. ఆ రకంగానే ఈ పావురాలపై ట్యాగ్ లను ఏర్పాటు చేశారా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైనా భాషకు చెందిన అక్షరాలు ఉండడంతో పావురాలను చైనా దేశం గూఢచర్యం కోసం ఏమైనా ఉపయోగించిందా అని అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా లేకపోలేదు. అయితే ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital