- ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా బెట్టింగ్ లు
- పోటీలు నిర్వహించడం ఆచారమన్న ఎరుకల సంఘం
- మూడు విభాగాల విజేతలకు బహుమతులు ప్రదానం
తాడేపల్లిగూడెం – కోళ్ల పందేలతో పాటు, గుండాట, పేకాట, లాటరీ, జూదం తదితర పోటీలు విచ్చలవిడిగా జరిగాయి. ఈ పోటీలకు తామేమి తీసిపోమంటూ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆయా జిల్లాల నుంచి పందెంరాయుళ్లు తమ పందులతో గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా బెట్టింగ్ లు కూడా కొనసాగాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందుల మధ్య పోటీలు రసవత్తరంగా జరిగాయి. నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామం, కోనసీమ జిల్లా వలస గ్రామం మధ్య పోటీలు నిర్వహించగా బుచ్చి గ్రామానికి చెందిన పంది విజేతగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లాలో తిరుపతిపాడు, కొమ్ముగూడెం గ్రామాల పందుల మధ్య పోటీ నిర్వహించగా, తిరుపతిపాడుకు చెందిన పంది విజేతగా రెండవ స్థానంలో నిలిచింది.
ఇక తూర్పుగోదావరి జిల్లా మండపేట, నిడదవోలు గ్రామాలకు చెందిన పందుల మధ్య పోటీ నిర్వహించగా మండపేట గ్రామానికి చెందిన పంది విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామాల మధ్య పోటీ జరగ్గా తాడేపల్లిగూడెం విజయం సాధించింది.
ఈ సందర్బంగా పోటీ నిర్వాకుడు సింగం సుబ్బారావు మాట్లాడుతూ… ప్రతి సంక్రాంతి పండుగకు ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారమని తెలిపారు. కత్తులు కట్టని, ప్రాణహాని లేని ఈ పోటీలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి వారికి పూర్తిస్థాయిలో మద్దతు కావాలని ఆయన కోరారు.